కథా వాహిని - సువ్వి

Wednesday, February 19, 2014

మమతలు కావాలి

మమతలు కావాలి

ఫిబ్రవరి-2014

“శ్రామిక విప్లవం మనుషుల మధ్య పెరిగిన దూరానికి నాందీవాక్యం పలికింది. అలాంటప్పుడు మనుషుల్ని మనుషులకు కానీకుండా చేసే విప్లవాలు ఎందుకు? చైతన్యంతో బాటు మమతలు పెంచే విప్లవాలు కావాలిగాని!” అంటూ తను రాయబోయే విషయానికి తొలిపలుకులు రాసుకున్నాడు “కిట్టూ” అని పిలువబడే కృష్ణమూర్తి.
***
పరిగెత్తుకుంటూ ఇంట్లోకొచ్చిన కిట్టూని చూసి
‘వచ్చాడా?’ అడిగాడు నాన్న. రాలేదన్నట్లు తలూపాడు కిట్టు.
‘రాలేదా!?’ అన్నాడు పెద్ద బాబాయి
‘రావాలే!’ అన్నాడు చిన్న బాబాయి
‘వస్తాడ్లే..’ తాపీగా అన్నాడు తాతయ్య
‘అయితే వచ్చే ఉంటాడా?’ నాన్న
‘వస్తే ఇంతాలస్యమా?’ విసుగ్గా పెద్ద బాబాయి
‘వస్తూ ఉన్నాడేమో!’ చిన్న బాబాయి
‘రాకుండా ఎలావుంటాడు!?’ నింపాదిగా తాతయ్య
‘ఈరోజు నాకెన్నో పనులున్నాయి అవతల ‘ సాలోచనగా నాన్న
‘నేనూ బయటికి వెళ్లాలి ‘ పెద్దబాబాయి
‘తనొస్తేగానీ నాపనవదు ‘ చిన్న బాబాయి
‘తొందరేం? అన్నీ అవుతాయిలే’ శాంతంగా తాతయ్య
ఇంతకూ వీళ్లందరూ ఎదురుచూసేది ఎవరికోసమనుకుంటున్నారు? వెంకటేశ్వర్లు కోసం! అవును వెంకటేశ్వర్లు రావాలి. అతను చెప్పే కొత్త కొత్త సంగతులు వినాలి. అతనొస్తే అక్కడి వాతావరణమే ఉత్సాహంగా ఉంటుంది. చాలా సందడిగా ఉంటుంది. ఎన్ని కబుర్లు చెప్తాడనీ! వాళ్లకి క్రాఫ్ చేస్తున్నంతసేపూ వరుసగా..
తాతయ్య కరణం కాబట్టి ఆయనతో పొలాలు, శిస్తులు, కొలతలు, వాళ్లూరి రాజకీయాలు!
నాన్న స్కూల్ మేస్టర్. అందుకని బడిపిల్లలు, వాళ్లు చదువుపట్ల చూపించే అశ్రధ్ధ, వాళ్లు నేర్వాల్సిన నాలుగు అక్షరమ్ముక్కల ఆవశ్యకత , వేమన పద్యాలు, నాటకాలు, వాళ్లూర్లో ఎవరెవరు ఏయే పాత్రధారులు..ఇవన్నీ!
ఇక పెద్ద బాబాయితో..పక్కనున్న టౌన్లో సినిమాలు, సినిమా విశేషాలు, ఎంటీఆర్ , ఏఎన్నార్ ఎలా నటించారు? ఆ డైలాగులు, ఘంటసాల పాటలు గురించి!
చిన్న బాబాయితో, కాలేజీ కుర్రాళ్లు, కొత్తకొత్తగా వచ్చిన ఫ్యాషన్లు, బెల్ బాటం ప్యాంట్లు, హిప్పీ క్రాఫులు ..గిరజాల జుట్టైతే ఎలా ఉంటుంది? జేబులో దువ్వెన ఎంత అవసరం! ఆ దువ్వెనను ఉపయోగించాల్సిన సందర్భాలు!
కిట్టూకి చిట్టి చిట్టి కథలు, చక్కిలిగింతలు, హాస్యోక్తులు!!
తాతయ్య వాళ్లమ్మ తాతమ్మ కూడా వెంకటేశ్వర్లు కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆమెకొచ్చే కీళ్లనెప్పులకి వైద్యం చెప్తాడతను. ఫలానా ఆకు రసం పూయమనో ఫలానా ఆకు దంచి కట్టమనో చెప్తాడు. అలా చేసినా పెద్దతనం వల్ల వచ్చిన నెప్పులు పోవు. అయినా సరే ఆమె తృప్తికోసం ఏవో చిట్కాలు చెప్తుంటాడతను.వైద్యంతో బాటు వేదాంతాన్ని కూడా జోడించి ఆమెతో మాట్లాడుతుంటాడు.
ఏమీ చదువుకోలేదుగానీ అతనికి తెలియని విషయం లేదు. చక్కటి ఉచ్చారణతో పాటు అతని మాటలు పంచదార గుళికల్లా ఉంటాయి. వాటిల్లో ఎదుటివారిపై ఆపేక్ష తొంగిచూస్తుంటుంది. అతనిచేతిలో మంచి పనితనం ఉంది. లోకాన్ని, లౌక్యాన్ని తెలిసినవాడు. మనిషి పొట్టిగా చామన చాయతో ఉంటాడు. నలభై ఏళ్లుండొచ్చు. ఎర్రంచున్న నీరుకావి ఖద్దరు పంచెను అడ్డపంచెగా కట్టుకుని, పొడవాటి ఖద్దరు చొక్కా వేసుకొని ఉంటాడు. ఒక చిన్న గుడ్డసంచీలో సామగ్రంతా ఉంటుంది. ఆ ఊరందరికీ ఇతనొక్కడే క్షురకుడు. పక్క ఊర్నించి నడిచి మరీ వస్తుంటాడు. అందరూ అతనికి ప్రతిఏటా సంవత్సరానికి సరిపడా వడ్లు పంచుతారు. తాతయ్యైతే కొత్త పంచెలచాపు కూడా పెట్టేవాడు. ఇదివరకు కొంత సాగుభూమిని కూడా రాసిచ్చాడట.
ఎప్పుడూ ఉదయం ఏడుగంటలకల్లా వచ్చే వెంకటేశ్వర్లు ఆవేళ తొమ్మిదైనా రాకపోయేసరికి కిట్టూ వాళ్లింట్లో ఏమీతోచని హడావుడి మొదలైంది. ఓవైపు పెరట్లో నీళ్లపొయ్యి మీద రాగికాగు నిండా నీళ్లుతెర్లుతూ ఉన్నాయి. రోజూ పెందలాడే స్నానాలైపోతాయి. ఇవాళ వెంకటేశ్వర్లు రావాల్సిన రోజు. అందుకే ఆలస్యం. అలాగని తీరా స్నానాలు చేశాక అతనొచ్చేస్తే ఎలా? అయిన ఆలస్యం ఎలానూ అయింది.
బామ్మేమో మడి కట్టుకునే సన్నాహాల్లో ఇవన్నీ పట్తించుకోదు. ఇంట్లో బావిదగ్గరే మడిస్నానం చేసేసి గీతాపారాయణ చేసుకుంటూ వంటచేయటానికి మడినీళ్లు తెచ్చుకోవటం, మడిబట్టలు ఆరేసుకోవటం రెండు కుంపట్లలో పప్పుకి, కూరకి ఏర్పాట్లుచేసి, అలికి ముగ్గేసిన కట్టెలపొయ్యిమీద, బియ్యప్పిండిని పూసిన ఇత్తడిగిన్నెతో (గిన్నెకంటిన మసి సులువుగా పోయేందుకు ఉపాయం) అన్నానికి ఎసరుపడేస్తోంది. అమ్మకూడా స్నానం కానిచ్చేసి బామ్మకి కూరగాయలు తరిగివ్వటం, బియ్యం అందించటం లాంటి సాయాలు చేస్తోంది. చిట్టికూడా ముస్తాబై దాని బొమ్మలకి పెళ్లిచేసే ప్రయత్నంలో ఉంది.
ఇంటిబయట అరుగులమీదనే తిష్ఠ వేసిన కిట్టూ “వచ్చేశాడు..వచ్చేశాడు” అని ఆనందంగా కేకలేసుకుంటూ లోపలికి పరిగెత్తుకొచ్చాడు. “హమ్మయ్య..వచ్చాడా!” అని అందరూ ముక్తకంఠంతో అడిగినట్లుగా పైకే అనుకున్నారు.
ఇక వెంకటేశ్వర్లుకి ఘనస్వాగతం లభించింది. అందరూ తలోవైపు అడగటం మొదలుపెట్టారు. “ఏం ఇంతవరకూ రాలేదు? ఎందుకాలస్యమైంది? ఇక రావేమో అనుకున్నాం..” ఇలా!
‘మా పక్కూర్లో తెల్లవారుఝామున పెళ్లి.మేళానికి వెళ్ళొచ్చా’ అని చెప్పాడతను.ఇంతలో పెరట్లో వేపచెట్టు నీడలో.. ఓ రెండు పీటలు పట్టుకెళ్ళి వేశాడు కిట్టు. ఒకటి వెంకటేశ్వర్లుకి, మరోటి క్రాఫ్ చేయించుకునేవాళ్ళకి. ఓ చేతి అద్దం కూడా పట్టుకొచ్చాడు.
వీళ్ళ కోలాహలం చూసి వెంకటేశ్వర్లొచ్చాడని అర్ధమైంది బామ్మకి. పెరట్లో తొంగి చూసి..
‘వెంకటేశ్వర్లూ! అన్నం తినెళ్లూ’ అని కేకేసింది బామ్మ.
‘నాకిక్కడ అన్నానికి కొదవేముందమ్మా? నీ చేతిముద్ద తినకుండా నేనెప్పుడు వెళ్ళాను?’ అన్నాడు. ఇంతలో చిట్టి ‘వెంకటేశ్వర్లూ! నా బొమ్మలకి పెళ్ళి. మేళం వూత్తావా?’అని అడిగింది.
‘బొమ్మలకేనా చిట్టితల్లీ? నీ పెళ్ళికి మాత్రం నేనూదొద్దూ?’అన్నాడు వాత్సల్యంగా.
ఇలా.. ఈ హడావుడి ,ఆదరణ ఎప్పుడూ వుండేదే. కొత్తేమీ కాదు.వెంకటేశ్వర్లుతో ఆ యింటికున్న అనుబంధమటువంటిది. ఆ యింట్లో తాతయ్యను తప్పించి అతనెవర్నీ మీరు, గారు అనడు. నువ్వనే అంటాడు. అయినా ఆ పిలుపు నిండా అభిమానం నిండుగా వుండేది. అలాగే..ఆ యింట్లో చిన్నపిల్లలు కూడా వెంకటేశ్వర్లుని పేరు పెట్టే పిలిచేవారు. అయినా అగౌరవంగా ఏమీ వుండదు. ఆ పిలుపులో ఆదరమే నిండివుండేది.
ఆ తరవాత్తరవాత..ఆ యింట్లో బాబాయిల ఒడుగులు, పెళ్లిళ్లు, కిట్టూ ఒడుగు, వాడి చెల్లెలు చిట్టి పెళ్ళి, మరికొన్నేళ్లకు కిట్టు పెళ్లి అయ్యాయి. అన్నింటికి వెంకటేశ్వర్లు అండ్ పార్టీ రెడీ. అవన్నీ అతని అధ్వర్యంలోనే జరిగాయి.అంటే బాబాయిలవీ, కిట్టుది పెళ్లిళ్లు ఆడ పెళ్లివారింట జరిగినా.. దేవుడికి పెట్టుకోటాలు, పెళ్లికొడుకుల్ని చేయటాలు, పెళ్లై తిరిగొచ్చాక సత్యనారాయణ స్వామి వ్రతం.. ఇవన్నీ అన్నమాట!
వెంకటేశ్వర్లుతోబాటు మేళం ఊదేందుకు ఒకొతను, డోలు వాద్యానికి మరొకతను, శ్రుతిపెట్టెతో(చిన్న సైజు హార్మోనియం పెట్టెలా ఉంటుంది) ఇంకొకతను మొత్తం నలుగురు వచ్చేవాళ్లు. వాళ్లంతా రావటంతోటే కిందపంచలో వాళ్లకోసం పరిచిన చాపమీద కూర్చుని, మంచినీళ్లందించగానే తాగేసి “పీ..పీ” అంటూ పీకలు సరిచూసుకునేవాళ్లు ఇద్దరు మేళగాళ్లు. డోలతను ఏవో పట్టీలు వేళ్లకు కట్టుకుంటూ ..”డుం..డుం” అని చిన్నగా తడ్తూ “మేం వచ్చేశాం” అన్నట్లు తెలియచేశేవాళ్లు. పెళ్లి పందిట్లో పిల్లలు కూడా “పీపీడుండుం” అంటూ సరదాగా వాళ్లని అనుకరిస్తూ సందడి చేస్తుండేవాళ్లు.
ఆపైన మొదటిగా “వాతాపి గణపతింభజే” తర్వాత “నీ లీల పాడెద దేవా” అంటూ మోయించేసేవారు. కాఫీలు, ఫలహారాలారగించి, బయట అరుగుమీద కొద్దిసేపు బైఠాయించేవారు. మళ్లీ నలుగుపెట్టీ వేళకి, హారతిచ్చే వేళకి లోపలికొచ్చేసి సన్నాయిమేళం ఊదేవారు. మధ్యాహ్నం భోంచేసి విశ్రాంతి తీసుకునేవారు.
ఇంటికి సున్నాలు కొట్టినా, ఎర్రమన్ను తీసి ఇల్లంతా తెల్లటి ముగ్గులు పెట్టినా, మామిడితోరణాలు కట్టినా, ఇల్లంతా బంధువులు తిరుగుతున్నా “అసలు పెళ్లి సందడి” మాత్రం వీళ్ల బాజాలతోటే మొదలౌతుంది. నిజానికి వీళ్లు పెళ్లంతా పురోహితుడితో పాటుగా, పోటీ గా వ్యవహరిస్తారు. పురోహితుడి సైగలనుసరించి ఎప్పుడేం మోగించాలో అప్పుడది చక్కగా మోగిస్తారు. తాళికట్టే వేళ గట్టిమేళం ఉంటుందీ.. విన్నవారికి ఒళ్లు జలదరించాల్సిందే! “ఆనందమానందమాయెనే, మా సీతమ్మ పెళ్లికూతురాయెనే! మా రామయ్య పెళ్లికొడుకాయెనే!” అంటూ పెళ్లి సంబారాన్ని మన మనసుకు అందించేలాగన్నమాట!
చిట్టిపెళ్లప్పుడు.. అత్తారింటికి పంపేటప్పుడు వెంకటేశ్వర్లు “పోయిరాగదమ్మ జానకి..మాతల్లి సీతా” అంటూ ఊదుతూవుంటే, ప్రతి ఒక్కరి కంటా నీరు తిరిగింది. ఆఖరికి మగపెళ్లివారి గుండెలుకూడా ఆర్ద్రమయ్యాయి. అంతలా మనసుపెట్టి మోగించాడతను.
ఎన్ని వాయిద్యాలున్నా, మరి ఈ బాజాలకే మంగళవాయిద్యాలన్న పేరొచ్చింది! మంగళకరమైన కార్యాలకు మంగలివారిదే ముఖ్య భూమిక! వివాహ వ్యవస్థను ముందుకు నడిపే నాయకుడే ఈ “నాయీ బ్రాహ్మణుడు”! తన నాదస్వరంతో నాదాల్ని పలికించే నాదబ్రహ్మ!
ఒక్కసారిగా కాలువలోకి ఉధృతంగా నీరొచ్చి గట్టుల్ని చెరిపేసినట్లు ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పు సంస్కృతి హద్దుల్ని చెరిపేసింది. కట్టతెగిన ఆప్రవాహంలో వెంకటేశ్వర్లు లాంటివాళ్లు ఏమూలకో కొట్టుకుపోయారు. వారి వారసత్వాన్ని పంచుకున్నవాళ్లున్నారు కానీ వారి ఉనికిని పెంచినవాళ్లు మాత్రం కరువయ్యారు.
క్రమంగా సన్నాయి స్థానంలో బ్యాండుమేళం, క్షవరం చేయించుకోటానికి సెలూన్స్ వెలిశాయి. ఒకప్పుడు ఒక్కరే రెండుపనులూ చేసేవారు. తర్వాత ఇద్దరూ మారారు. ఎవరిపని వారిదే!
ఆ సెలూన్స్ కి వెళ్లేవారికి కానీ, ఈ పెళ్లిళ్లకు వచ్చిన భజంత్రీలకు కానీ సాదర స్వాగతమేమీ కనిపించదు.
అంతా యాంత్రికతే. ఇంతాచేసి ఆర్ధిక సంబంధాలే!
***
“ఏంటి కిట్టమూర్తీ! డైరీ రాయటమింకా పూర్తవలేదా?” సత్యభామ పడగ్గదిలోకి వస్తూ అడిగింది. ఆమె తన భర్తను ఏకాంతంలో అలానే పిలుస్తుంది. “అయింది భామా” డైరీ మూసేస్తూ భార్యవైపు తిరిగాడతను.
“ఈరోజు ఎవరిగురించి రాశావేంటి? అయినా నీ ఎగ్జాములప్పుడుకూడా ఇంతలా రాసుండవనుకుంటా!”అంది భామ. నవ్వాడు కిట్టు.
“నేనిప్పుడు రాసేదంతా మన పండూగాడు పెద్దయ్యాక చదువుకోవాలి. వాడికి పాతరోజులెలా ఉన్నాయో తెలియాలి. అప్పుడుగానీ వాడు సోషల్ వాల్యూస్, హ్యూమన్ రిలేషన్స్ అంటే ఏంటో తెలుసుకోగలడు” అన్నాడు.
“నిజంగా ఆ విలువలు తెలియాలంటే అవి వాడి అనుభవం లోకి వచ్చినప్పుడే తెల్సా? చదివితే వచ్చేది అవగాహనేగానీ, అనుభవం కాదుకదా!?”అంది భామ.
“అవునుకదా!” కొద్దిపాటి దిగులుతో అన్నాడు కిట్టు.
“వాడు నీవు రాసింది చదివి నీలా ఫీలవాలనుకోవటంలో అర్ధంలేదు. నీ నేటివిటీ వేరు. వాడి నేటివిటీ వేరు. నీ చిన్నప్పటి నేపథ్యాన్ని ఇప్పుడు వాడికి మనం అందించగలమా? లేదుకదా!? “అంది.
“మరెలా?” ఒకింత ఆదుర్దా అతని ప్రశ్నలో.
“అందుకు మనం చేయాల్సిందల్లా ఒకటే. అటువంటివాళ్లకోసం అన్వేషణ. వాళ్లు దొరికినప్పుడు కొనసాగించాల్సిన స్నేహం. అంతే!”తేల్చిచెప్పింది భామ.
కిట్టూకి ఇప్పుడు మనసు తేలికపడింది.
*** ** ***

No comments:

Post a Comment