"మా ఇంటిముందు అరుగులు మేమాడిన అచ్చనగిల్లాల ఆటలో భాగస్వామ్యమయ్యాయి!మా వీధులు మేముతీసిన ఉరుకుల పరుగుల సందడులకు బారులుతీరాయి! మా మధ్యహాలు మేమాడిన అష్టాచెమ్మలకు ఇష్టసఖి అయింది! మా డాబా మేము పాడిన వెర్రిపాటల్ని చందమామకు చేరవేసింది. మా పంచ మేము గట్టిగా వల్లెవేసిన మా పాఠాలన్నీ నేర్చుకుంది. మా వసారా మేము విన్న భారత, రామాయణ కథలకు వేదికయ్యింది. మా చిట్టిచేతులు నిత్యం వచ్చిపోయే అతిథులకు మంచినీరు అందించాయి..వారి భోజనాలకు విస్తళ్లు వేసాయి. మా మనసులు ఊరి చెరువుకు అద్దంపట్టాయి!మా గొంతులు దేశాభిమానాన్ని చాటిచెప్పాయి!! మా చిన్నతనం ఎంత సజీవంగా బతకాలో నేర్పింది!!" చూశావా నిర్మలంగా బతికితే ప్రతిదీ అండగా ఉంటుంది. నీకు నువ్వే మారిపోయి ప్రపంచం మారిందంటావేం!? నీవు నాలోనుంచి వెళ్లిపోయి బద్దకపు పంజరాన్ని ఎంచుకున్నావేం? కనిపించని సంకెళ్లను నీకు నీవే బిగించుకున్నావేం? మనసా! వచ్చేయ్..మళ్లీ నాలో చేరు. మాసిపోయిన మునుపటి జీవన చిత్రానికి అందంగా వన్నెలద్దు!! ప్రపంచం చేరువౌతుంది!! జీవితం ధన్యమౌతుంది!
పిలవని పిలుపులు..పలుమరు పులకలు!
పులకల ప్రోవులు..పరిపరి ప్రియములు!
పొంకములైన పలువలువలు.. పలుకగరాని ప్రియరవములు!
పొలపమున విరియు పరువములు..పొంగారే ప్రియతనముల పోడిమిలు!!
కనుల కొలనుల్లో కలువల్లాంటి కలలు..
కలువ కన్నుల్లో కలలు కనే కాలాలు..
కనులు ఒకటి కాలేవూ!?
కలుసుకోలేవూ నువ్వూ!?
కానీ..కాలాన్నే కననిమ్ము!
కలువల కలల కనురెప్పల విలసనమ్ము!!
మరువలేను ప్రియా నీ ఊసులు!
మరువాలు అద్దిన ఆ బాసలు!
మరీమరీ మనసిచ్చిన నీ మురిపెంపు మాటలు!
మరులుగొల్పి మరచితివి..మరి నీకే చెల్లును ఈ నాటకములు!!
అలుకలు తగునా లలనా?
నను అలచుట న్యాయమా?
అలరు మోమున అలదిన అరుణిమ! అలకలు అల్లల్లాడే అలికము న!
అల నా మనము చిక్కుకొనియే.. అలరించ రావేలనే చెలియ!
No comments:
Post a Comment