బుక్కులు
మీరు సరీగ్గానే విన్నారు! ఎన్నాళ్లైందో కదా ఈ పదాన్ని ఉపయోగించి!?
మన కథల పుస్తక ప్రస్థానం గురించి మాట్లాడాలనిపించిందీ రోజు.
అమ్మ మనకు పరిచయం చేసిన మూడు చందమామలే మన ఈ పయనానికి ఒక అర్ధాన్ని సమకూర్చాయి.
ఆ మూడు చందమామలు:
1. అమ్మ చంకనెత్తుకొని గోరుముద్దలు తినిపిస్తూ.."చందమామ రావే.." అంటూ పాడి..మనకు నేర్పించి..మన మనసుల్లో ఉత్సాహానికి
బీజం వేసింది!
2. ఆ తర్వాత, కొద్దిగా ఊహ తెలిశాక చెప్పిన --చందమామలో రాట్నం వడుకుతున్న అవ్వ, పరుగెడుతున్న కుందేలు --కథ, కథల
మీద ఆసక్తికి సరికొత్త నాంది అయింది.
3. కాస్త చదవగలిగే నాటికి "చందమామ" పుస్తకాన్ని అందించింది.
అది కొన్నాళ్లకే అపురూపమై..దినచర్యలో ఒక భాగమైంది. నెలంతా ..మళ్లీ వచ్చే పుస్తకం కోసం నిరీక్షణ! మరోలా .. చందమామ
రావే..అంటూ ఆలపించేలా!!
ఒక్క చందమామేనా.. బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు, జాబిల్లి,(బాల..న్యాయపతి రాఘవరావు గారి పత్రిక ..నేను పుట్టేనాటికే ఆ పత్రిక
ఆగిపోయిందనుకుంట!)
మరి ఈ పత్రికలు.. మనకు ఊహాశక్తినే పెంచాయో .. మన బుర్రల్లో ఊహాచిత్రాల్నే గీశాయో !!(కళాశ్రీ లాంటి వాళ్ల బొమ్మలున్నప్పటికీ)
అందాల రాకుమారి, వీరుడైన రాకుమారుడు, పంచకళ్యాణి గుర్రం, మాట్లాడే చిలుక, మాంత్రికుడు, ఒంటిస్తంభం మేడ, సప్త సముద్రాలు,
మర్రిచెట్టు, ఒంటికన్ను రాక్షషి, రాక్షసబల్లి...ఇవన్నీ ఓ కొత్తలోకం లోకి మనల్ని తీసుకెళ్లి వదిలిపెట్టేవి!
గుణవంతులు, ధైర్యవంతులు, పరోపకారం చేసేవాళ్ళు, లౌక్యం, సమయస్పూర్తి తెల్సిన వాళ్లు, దాన గుణం కలిగిన వాళ్లు, మెతక వాళ్లు,
మృదుస్వభావులు, వెర్రివాళ్లు, అత్యాశాపరులు, దురాశాపరులు, పిరికి వాళ్లు, గయ్యాళివాళ్లు, దుర్మార్గులు..
ఒకరేమిటి..అందరూ మనముందుకొచ్చి నిలబడి జీవించేవాళ్లు! ఎలా వుండాలో, ఎలా వుండకూడదో నేర్పేవాళ్లు!
"అనగనగా..ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు.." అంటూ తాతయ్య వినిపించిన కథ , కథలు చదివేవైపుకు నడిపించిన మొదటి
అడుగని చెప్పాలి!
బోధిసత్వుడు బ్రహ్మదత్తుడిగా రావటం , కథంతా విని, సమాధానం దొరకగానే బేతాళుడు చెట్టెక్కేయడటం లేదా యువతి జంతువుగా
మారి అడవి లోకి పరిగెత్తటం, తెలిసీ సమాధానం చెప్పకపోయావో నీ తల వేయి వక్కలౌతుందని విక్రమార్కున్ని బేతాళుడు బెదిరించటం,
సిం హాసనాన్ని అధిరోహించే భోజుణ్ణి సాలభంజికలు అడ్డుపడటం..ఇవన్నీ ధైర్యంగా ముందుకు నడిపే చిట్కాలు నేర్పినట్లుండేవి!
ఇవన్నీ పునాది రాళ్ళు!
ఇక బాల్యము, కౌమారమూ దాటి యవ్వనంలోకి అడుగు పెట్టాక మనల్ని ఊహల పందిరిని అల్లుకునేలా, ఆశల పల్లకిని అందగించేలా
చేసినవి..నవలలు! మరి ఆ వయసుకు తగిన ముగ్ధత్వం వుంటేనే ఆరొగ్యంగా వున్నట్లు!
ఇంట్లో పెద్దవాళ్లు వారపత్రికలకోసం తన్నుకుంటుండే కాలం!
అవును మరి ధారావాహికలు వస్తుండేవి కద? చక్రభ్రమణం, మీనా, మీరా ఒకటేమిటి.. ఇలాంటి చిక్కటి ఫిక్షన్ .. ఫిల్టర్ కాఫీ డికాక్షన్ లా
ఆకర్షిస్తుండేవి! యువ, విజయ లాంటి మాస పత్రికలు, ఆంధ్ర పత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ లాంటి వారపత్రికలు ఈ కాఫీ లాంటి సీరియల్స్
ని అందించేవి! ఇవి ఇంకావుంది అంటూ వూరించేవి!(కృష్ణబావ ఇంకావుంది.. అనుంటే పత్రికంతా వెతికేవాడట..ఎక్కడుందో అనుకుంటూ!
తన ఫ్రెండ్ నర్శిం హ చెప్పేదాక అసలు విషయం తెలీలేదట!) పత్రికల్లొ వచ్చిన సీరియల్స్ ని పెద్దవాళ్లు కత్తిరించి బైండింగ్ చేయించారు.
అవే.. పదహారేళ్ల వయసులో ఆ పాత బైండింగులే చదివింది ! చక్రనేమి, పూజారిణి,కీర్తి కిరీటాలు లాంటి నవలలు (ఆరెకపూడి,
యద్దనపూడి,పోల్కంపల్లి శాంతాదేవి లాంటి నవలాకారులు) పురాణం వారి ఇల్లాలిముచ్చట్లు కూడా. వాటిని చదివి కొంత వ్యక్తిత్వానికి
వన్నెలద్దుకున్న మాట నిజం!
అప్పుడే వచ్చాయి..సెన్సేషనల్ నావెల్స్..యండమూరి, మల్లాది వారివి!
కొత్తదనాన్ని సరికొత్తగా పరిచయం చేసిన నవలలు!
భావుకతను మనసుకు అద్దిన కథనాలు!
జీవితాన్ని కొత్త బాణీలలో సమకూర్చిన కూనిరాగాలు!!
(అవును మరి కూనిరాగం ఎవరైనా పాడుకోగలిగినది!)
అవి చాలా ప్రభావితం చేసాయి! వీటితో బాటు చలం సాహిత్యం!
టీనేజ్ దశ దాటాక అసలైన సాహితీప్రపంచం లోకి అడుగుపెట్టాం కదా?
చాసో, తిలక్, కొడవటిగంటి, మల్లాదిరామకృష్ణ శాస్త్రి, శ్రీపాద,మధురాంతకం, ముళ్లపూడి వెంకటరమణ సాహిత్యం, శంకరమంచి
అమరావతి కథలు ..ఇలా ఎన్నెన్నో!
ఇవన్నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోటంలో సహాయం చేశాయి.
నేనంటాను మన దృక్కోణం విశ్లేషణే అవక్కర్లేదు. అంత స్థాయి అవసరం కూడా లేదు. చదివి మనల్ని అహ్లాదంగా వుంచుకోగలిగితే చాలు.
జీవనవిధానం ఖచ్చితంగా బాగుంటుంది. మనము సంతోషంగా వుండగలం! మన చుట్టూ వారినీ సంతొషంగా వుంచగలం! ఇదే నా
పాలసీ!
మీరేమంటారు? ఒప్పుకుంటారుగా బుక్కులు..మన పాలిటి ఋక్కులని!!