కథా వాహిని - సువ్వి

Thursday, April 4, 2013

సౌరు


సౌరు
దీపారాధన చేస్తుంటే.. ఆ వాసన ఒక్కసారిగా నన్ను వెనక్కు నెట్ట్టేసింది. మా బాలపిన్నితో కలసి రోజూ ఉదయాలు రాములవారి గుడికి వెళ్ళేదాన్ని. గర్భగుడి బాగుచేసి, ముగ్గేసిరావటం, సాయంకాలాలు సంధ్య దీపారాధన చేయటం! మా ఉర్లో అలా సంవత్సరానికి రెండు నెలలు మా ఇంటి వంతు వచ్చేది. సాయంకాలాలు దీపారధన వాసన..ఇప్పటికీ ముక్కుపుటాలకి తాజాగా తగులుతుంది. నేను బుట్టచేతుల గౌను వేసుకొని, మా పిన్ని వెనుక ముగ్గుబుట్టో, అగ్గిపెట్టొ తీసుకొని వెళ్తున్న చిత్రం కూడా తాజాగా కనబడ్తుంది.
దేవిడిమీద భక్తి తెలియని వయసది. సీతారామలక్ష్మణుల విగ్రహాలు మౌనంగా మేంచేస్తున్న పనిని చూస్తున్నారన్నట్లు భావించేదాన్ని. విగ్రహాల మీద ఆపేక్ష! మావూరు..మా గుడి..మా దేవుడు..గుడిగంటలు ..అన్నీ 'మా ఉనికిని ' తెలియచేయటానికే అన్న భావాన్ని అప్పటికి వ్యక్తం చేయగల శక్తి లేకపోవచ్చు. అప్పటి నా చిన్న మనసుకు "అంతా మనదే" అన్న నిష్కళంక ప్రేమ! కంటిముందే బాల్యం మరెన్నో వాసనలు మూటగట్టుకొని..మెదడులో వాటిని ప్రత్యేక అణువుల్లో భద్రపరిచింది. ఏ వాసన వస్తే ఆ విభాగం తలుపులు తెరుచుకుంటాయ్. మల్లెపూల వాసన, వేపపూల వాసన ..మా వూరి మా పెరట్లోకి తీసుకెల్తుంది. దేవగన్నేరు మా హేమలత పిన్ని వాళ్ల గాయత్రి అమ్మవారి గుడిని(వాళ్ల మామిడితోటలో ..పూర్వీకులు కట్టించిన గుడి అది), పారిజాతాలు .. పిన్నీ వాళ్లింటిని,(అత్తగారిల్లు ..పేద్ద ఉమ్మడి కుటుంబం)గుర్తుకు తెప్పిస్తాయి. సిం హాచలం సంపెంగలు విశాఖ వీధుల్లోకి లాక్కెళ్తాయి. ఎంత ఉల్లాసంగా, ఆనందంగా గడిపిన రోజులవి! వీధి బడిలో (ఎలిమెంటరీ స్కూల్) గుక్కతిప్పుకోకుందా రెన్ రెండ్లారు..అంటూ ఇరవై ఎక్కాలూ వల్లెవేయటం ..పక్కనే ఉన్న మాఇంట్లోనుంచి చిలకడ దుంపలు వేగుతున్న వాసనకి..'మంచి నీళ్లు ' అంటూ మేష్టారి ముందు బొటనవ్రేలు చూపించి..తుర్రున ఇంటికి పరుగుతీసి, నీళ్లపొయ్యిలో నిప్పుల మధ్య కాలుతున్న దుంపని పుల్లతో బయటకు లాగి..నోరు కాలుతున్నా లెక్కచేయకుండా ఆదరాబాదరాగా మింగేసి..ఇన్ని మంచినీళ్లు తాగేసి..నీళ్లతో గొంతు, బట్టలు తడిసినా తుడుచుకోకుండానే మళ్లీ పరుగెత్తుకుంటూ స్కూల్లోకొచ్చి పడటం!
పాత పుస్తకం వాసన..కొత్త పుస్తకం వాసన..దేనికదే సాటి! ఎంత ఆస్వాదించినా తనివి తీరదు! తొలకరి చినుకులకు తడిసిన నేల వాసన, గమ్మత్తైన తడిసిన గచ్చు వాసన, గోడమీద నీళ్లు చల్లి మరీమరీ చూసిన సున్నం వాసన, బావి గిలకపై తడిసిన చేంతాడు వాసన, గోధూళి వాసన, గొబ్బెమ్మల వాసన, పచ్చ్టి తాటాకు పందిరి వాసన, చేటలకు పూసే కాగితం..మెంతులు కలిపి రుబ్బిన పిండి వాసన, కుంపట్లో మరుగుతున్న పాల వాసన,గాదెల్లో ధాన్యం వాసన, గాలికి తేలివచ్చే మంచి తుమ్మపూల వాసన, నిండుగ పారే పంట కాలువ వాసన, పండు మిరపకాయ చేలో బంతిపూల వాసన, కొత్తిమెర చేల వాసన, సంక్రాంతికి రేగుపండ్ల వాసన, మగ్గబెట్టిన మామిడి పండ్ల వాసన, తొలిఏకాదశికి పేలాలు, నువ్వు పిండి వాసన, దోసగింజలు వేగుతున్న వాసన ఒకటేమిటి ఇవి అనుక్షణం మన ఉనికినీ, విలువనీ తెలియచేస్తూనే వుంటాయి. అయితే..కాలం తోబాటు..పల్లె ప్రజల ఆలోచనల్లోనూ మార్పు..పల్లెను పల్లెఉనికి కి దూరం చేశాయి. ఆ విలువను పోగొట్టుకుంటున్నాయి. చివరికి నేల వాసన నేలకు లేకుండా పొయింది. ఇంట, బయటా.. అంతా..పురుగుమందుల వాసన తో నిండిపోయింది!!

No comments:

Post a Comment