కథా వాహిని - సువ్వి

Sunday, May 5, 2013

లైఫ్ ఆఫ్ పై


 లైఫ్ ఆఫ్ పై కి వచ్చిన ఆస్కార్ అవార్డులు నిజానికి భారతీయతకు వచ్చినవే. భారతదేశం లోని దారిద్యాన్ని మాత్రమే చూసే మహానుభావులకి

అసలైన భారతీయతను చూపించిన ప్రయత్నం చేసిన దర్శకుడు ఆంగ్ లీ .. ముఖ్యంగా రచయిత యాన్ మార్టెల్ కు బోలెడు కృతఙ్ఞతలు

చెప్పుకోవాలి.
సకల చరాచర బ్రహ్మాండమంతా ఓ చిన్న కుటుంబం తో మొదలై, ఆ చిన్న కుటుంబంతోనే సుఖాంతమౌతుందన్న భారత సంస్కృతి ని ఈ

సినిమా చూపించింది. మన మనసుల్ని చూరగొంది.
 క్రీస్తును , అల్లాను పరిచయం చేసినందుకు విష్ణువుకు ధన్యవాదాలు తెలుపుకున్న భారత మతాన్ని ప్రపంచానికే పరిచయం చేసింది.
కష్టనష్టాలలో , ఒడుదుడుకుల్లో వున్నవారిని గమనిస్తూ, మార్గాన్ని చూపిస్తూ, ముందుకు నడిపించే ఓ అదృశ్యమూర్తిని దృశ్యరూపం

గావించింది.
ఓ చిన్న ఆశ, ఓ గొప్ప విశ్వాసం మనిషిని అడుగడుగుకీ ముందుకు నడుపుతాయన్న ప్రాథమిక పాఠాలని నేర్పింది.
భయంకరమైన ఒంటరితనంలో కౄరమృగాన్ని సైతం స్నేహితుడిగా భావించిన, ఆదరించిన.. అంతర్లీన మానవత్వవు ఛాయల్ని వెలుగులోకి

తెచ్చింది.
ఇంతెందుకు, మహాసముద్రమంత భారతీయ తత్వాన్ని నిండుగా, మెండుగా ప్రత్యక్షం గావించింది. అవగాహన చేసుకొనేందుకు ఓ అవకాశాన్ని,

ప్రయత్నాన్ని కల్పించింది.
ఎన్నో మాయాజాలాల్ని గుప్పించిన సినిమాలని దాటి అవలీలగా ముందుకు దూసుకెళ్లిన ఈ "విశ్వమాయా"(విష్ణుమాయ) చిత్రాన్ని గుర్తించిన

జ్యురీ సభ్యులకు ధన్యవాదాలు చెప్పుకోవాలి.
ఇందులో నటీనటులందరూ మెప్పించేవారే..మెప్పించినవారే!
ముఖ్యంగా, హైలీ ఇంటలెక్చువల్ గా కనిపించే పై పటేల్ పాత్రకు
బాల నటుడు సరేసరి! నవయువకుడుగా సూరజ్ శర్మ ద గ్రేట్ ఇండియన్ బాయ్..హాట్స్ ఆఫ్ హిం !

-చింతలచెరువు సువర్చల

Wednesday, May 1, 2013

రైతుబిడ్డ

 
     - రచన:            చింతలచెరువు సువర్చల

అప్పటి దాకా పరిగెడుతున్న కారు తన వేగాన్ని తగ్గించింది. ఆ కార్లో కూర్చుని చుట్టూ పరిసరాలు చూస్తున్నాడు ఆరేళ్ళ "పండు". వాడికవన్నీ అబ్బురంగా తోస్తున్నాయి! పచ్చగా వున్న వరిపొలాల్ని చూసి "అబ్బ! ఎంత గ్రీనిష్!" అని తన చిట్టిచేతుల్ని నోటిపై పెట్టుకుంటూ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎత్తైన తాటిచెట్లను చూసి "ఎంత లాంగ్ గా వున్నాయో!" అని కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నాడు. పంట కాలువల్లో కనిపించే కొబ్బరి చెట్ల ప్రతిబింబాల్ని చూసి 'భలేగా వున్నాయం'టూ చప్పట్లు కొడ్తున్నాడు. అడపా దడపా కనిపించే ఎద్దులబండ్లను చూసి.. తను చూసిన పుస్తకాల్లో బొమ్మలుగా గుర్తిస్తున్నాడు. కొడుకు ఉల్లాసాన్ని చూస్తున్న రవి, ఉష ఒకరివంక ఒకరు చుసుకొని నవ్వుకుంటున్నారు. మధ్యమధ్యలో వాడ్ని ముద్దు చేస్తున్నారు. వాడి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్తూ, వాడి సందేహాలను తీరుస్తున్నారు.
అక్కడ చూస్తున్నవన్నీ వాడికాశ్చర్యాలే! తాటిచెట్లెక్కిన వాళ్లని చూసి.. వాళ్లక్కడికి ఎలా వెళ్లారో ఆ చిన్ని బుర్రకి తట్టలేదు.
"నాన్నా! వాళ్లక్కడెలా వున్నారు?" అని అడిగాదు.
వాళ్లు చెట్లెక్కార్రా నాన్నా. అదిగో అలా చూడు.. అతనెలా ఎక్కుతున్నాడో!" అంటూ మరోవైపు, అప్పుడే చెట్టెక్కబోతున్న వాడ్ని చూపించాడు రవి.
చెట్టుని చేతుల్తో ఆసరాగా తీసుకొని..పాదాల్ని చెట్టుకు అదిమిపెడ్తూ .. చకచకా పైకెక్కుతున్న వైనాన్ని చూసి..
"వాళ్లు స్కూల్లో నేర్చుకుంటారా నాన్నా?
అంటూ అడిగాడు.
"లేదు కన్న! ఇలాంటివి స్కూల్లో నేర్పరు. నిజానికి కొన్నింటిని స్కూల్లో నేర్చుకోలేం తెల్సా!? వాళ్లంతా పెద్దవాళ్లనో, తోటివారినో చూసి, ముందు ట్రై చేస్తారు. నెమ్మదిగా నేర్చుకుంటారు. అలా చూడు.. ఆ కాలువలో ఈత కొడుతున్నారా పిల్లలు? వాళ్లు కూడా అంతే.." అన్నాడు రవి.
"బాబుకి చాలా ఇంట్రెస్ట్ వుంది సర్" మెచ్చుకున్నాడు కారు డ్రైవర్ రాజు.
అవునంటూ తలూపాడు రవి.
ఇంతలో కారు ఊర్లోకి వచ్చేసింది.
 అన్ని ముంగిళ్ల ముందూ వేసిన ముగ్గుల్ని గమనించాడు. ఇళ్ల పెరళ్లలో పూల మొక్కలో, పండ్ల చెట్లో వుండటం కూడా చూశాడు. కారు తిన్నగా ఓ ఇంటి ముందాగింది. కారు ఆగటమే తడవుగా పండు వాళ్ల బామ్మ, తాతయ్యలు శారద, ప్రకాశంలు.. అప్పటిదాకా ఎదురు చూస్తున్నారులా వుంది.. గబగబా గేటు బయటకు వచ్చేశారు. పండుగాణ్ణి అక్కున చేర్చుకున్నారు.
"రామ్మా!" అంటూ కోడల్ని, "ప్రయాణం బాగా జరిగిందా?" అంటూ కొడుకునీ పలకరించారు. సామాన్లన్నింటినీ వెంకన్న, డ్రైవర్ రాజు సాయంతో లోపల పెట్టేశాడు. డ్రైవర్ని భోంచేసి వెళ్లమని రవి చెప్పాడు.
"వద్దండీ" మొహమాటపడ్డాడతను.
"అదేంటీ.. భోజనం చేయకుండా ఎలా పంపిస్తాననుకుంటున్నావ్?"
"పక్క టౌన్లో భోంచేసే వెళ్తానండీ" అన్నాడతను.
"హోటల్లో ఎందుకయ్యా.. ఇల్లుండగా" ప్రకాశం అన్నాడు.
"పాతరోజుల్లో ఐతే వేరు.. ఇప్పుడా సౌకర్యం వుంది కదండీ!" అన్నాడు రాజు.
"పాత, కొత్త రోజులు కాదయ్యా, మంచి సాంప్రదాయాల్ని ఎప్పటికీ పాటించాల్సిందే. ఆ మాటకొస్తే .. కొత్తగా వచ్చే మంచివాటిని కూడా సంప్రదాయంగా స్వీకరించాల్సిందే!" అన్నాడాయన.
ఇంతలో "అన్నం తినే వెళ్లండంకుల్" అని పండు, రాజు చేయి పట్టుకొని అడిగాడు. ఆ చిన్నవాడు చూపించిన అభిమానానికి, పెద్దాయన చూపించే ఆదరానికి ఇక అతను కాదనలేకపోయాడు.
"మొహమాటపడకు. భోజనం తయారయ్యేదాకా కాస్త విశ్రాంతి తీసుకో" అంటూ రవి లోపలికి నడిచాడు.
"పదనాన్నా.. లోపలికెళ్దాం" మనవడి చేయి పట్టుకొని ప్రకాశం ముందుకు కదిలాడు.
తాతయ్య చేయి పట్టుకొని, కాంపౌండు లోపలికి అడుగుపెట్టిన పండు విభ్రమంగా చూస్తుండిపోయాడు.
'మామిడి చెట్టు.. బాదం చెట్టు.. పనసచెట్టు.. సపోటాచెట్టు.. కొబ్బరిచెట్టు.. నిమ్మచెట్టు..' అంటూ అన్నింటిపేర్లూ చెప్పేస్తూ.. ఆ చెట్ల మధ్యనే తిరుగుతున్నాడు.
"ఒర్నీ.. వీటిపేర్లన్నీ నీకెలా తెలుసురా?" అని తాతయ్య అడుగుతుంటే..
"ఓ..నాకు బాగా తెల్సు.. తెల్సా?" అని తిరిగి ఆయన్నే ప్రశ్నిస్తున్నాడు వాడు.
"వాడికి మేమే చెప్పాం నాన్నా! వాటి ఫొటోగ్రాఫ్స్ నెట్ లో దొరుకుతాయి కదా?" అన్నాడు అప్పుడే అటుగా వచ్చిన రవి.
"వీడికి చెట్లంటే చాలా ఇష్టంలాగుందే!?" అడిగాడాయన.
"అవున్నాన్నా.. అన్ని రకాల చెట్లనీ.. ఇంట్లో ఒక్కచోటే.. రియల్ గా చూసేసరికి చాలా హ్యాపీగా వున్నాడు." అన్నాడతను.
"అక్కడ వుండవట్రా?"
"ఉంటాయి. మనలా మాత్రం కాదు. ఇంట్లో క్రోటన్సుంటాయి. కొంతమంది కూరగాయలు కూడా పండిస్తుంటారు. కానీ ఇక్కడి నేటివిటి వేరు కదా!"
ఇంతలో లోపల్నుంచి పిలుపులు వచ్చాయి.
"లోపలికి పోదాం పద కన్నా!" మనవడ్ని అడిగాడు తాతయ్య.
"నేన్రాను.. ఇక్కడే ఆడుకుంటా" అన్నాడు వాడు.
లోపలికి నడిచాడు రవి.
కొడుకుని అనుసరించలేక, మనవడ్ని వదల్లేక అక్కడే రెండు కుర్చీలు వేయించుకొని, ఓ దాంట్లో కూర్చుని.. మనవడి చేష్టల్ని మురిపెంగా చూస్తుండిపోయాడు.
****
మధ్యాహ్నం భోజనాలయ్యాక డ్రైవరికి డబ్బిచ్చి పంపించాడు రవి. వాళ్ళ ఆదరణకు అతను కదిలిపోయాడు. కృతఙ్ఞతలు చెప్పి వెళుతూ వెళుతూ...'సార్! మీరు తిరిగి వెళ్ళేటప్పుడు నాకొక్క ఫోన్ చేయండి. నేను మళ్ళీ ఇక్కడికే వచ్చి, మీరు తిరిగి అమెరికా వెళ్ళేదాక...ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీస్కెళ్తాను.మిమ్మల్ని ఎయిర్ పోర్ట్ దాకా దిగబెడ్తాను సార్...' అంటూ ఫోన్ నంబరిచ్చాడు.
'ఓ...ష్యూర్! అంటూ అతనికి ష్యేక్ హ్యాండిచ్చి, థ్యాంక్స్ చెప్పాడు రవి. డ్రైవర్ వెళ్ళిపోయాక... వెంకన్నతో మాట్లాడుతూ కొద్దిసేపు...పంచలోనే నుంచుండిపోయాడు. లోపల్నుంచి వాళ్ళమ్మ పిలిచేసరికి...'కాసేపు పడుకో బాబూ' అంటూ వెంకన్న వెళ్ళిపోయాడు.
*****
ఓ రోజు ఉదయం లాప్ టాప్ ముందు కూర్చుని...పండు ఏదో ఆసక్తిగా ఆడటం చూసి...అటుగా వెళ్తున్న ప్రకాశం, తానూ ఆసక్తిగా చూడటానికి వచ్చాడు. వాడు కంప్యూటర్లో ఆడుతున్న ఆట ఆయనకు ఆశ్చర్యమనిపించింది.
'ఏంటిరా ఇది?'అని అడుగుతూ...తనకున్న ఇంగ్లీషు పరిఙ్ఞానం కొద్ది ' ఇ కృషి ' అని స్క్రీన్ పైనున్నదాన్ని పైకి చదివాడు.
'ఔను తాతయ్యా! ఇవి క్రాప్స్. నేనే క్రాప్స్ కావాలన్నా వేస్తాను తెల్సా?'
'అవునా...ఏదీ ఒక్క పంట వేసి చుపించు...' అని అడిగేసరికి... 'ఇదిగో చూడు...'అంటూ అక్కడున్న టూల్స్ యూజ్ చేసుకుంటూ పొలాల్ని, మనుషుల్ని క్రియేట్ చేస్తూ... పంట పండించే ప్రాసెస్ అంతా తానే వాళ్ళ చేత చేయిస్తూ...పది నిమిషాల్లో కొమ్మలకు వేలాడే యాపిల్స్ తో సహా చూపించేశాడు పండు.
అదంతా చూసి "నా మనవడివనిపించుకున్నావురా" అంటూ "ఇదిగో శారదా! ఇలారా.. మన పండు వేసిన పంట చూడు.." ఆనందంగా కేకేశాడు. కోడలితోపాటే వచ్చి చూసిన శారద అవాక్కయింది. "ఎలా చేశావురా!" అంటూ.
"బామ్మక్కూడా చూపించరా నాన్నా" అని ముద్దుగా అడిగాడాయన.
ఈసారి పుచ్చకాయల్ని పండించాడు పండు. శారద తన మనవడ్ని అపురూపంగా అక్కున చేర్చుకుంది.
'ఇవెవరు కనిపెట్టార్రా' విస్తుపోయాడాయన.
'యు.ఎస్.లోనే మైక్రోసాఫ్ట్ వాళ్ళు నాన్నా. ఈ ఆటల్లో పొలం దున్నటం, పంట పండించటమే కాదు. ఆవుల్ని పెంచటం, పాలనీ, పంటల్నీ ట్రేడింగ్ చేయడం కూడా వుంటుంది. వాళ్ళ బ్యాంక్ బ్యలెన్స్ కి అనుగుణంగా, అవి చేసేవాళ్ళని, ప్రొడక్షన్ కి అవసరమయ్యే వాటిని క్రియేట్ చేసుకొవచ్చు. అదంతా ఓ వర్చ్యువల్ వరల్డ్ అన్నమాటా అన్నాడు రవి. ఆశ్చర్యంగా వింటూండిపోయారిద్దరూ!
'మీ తాతగారు నిజ్జంగా పంటలు పండిస్తారు తెల్సా? ఇలా కంప్యూటర్లో కాదు...ఫీల్డ్స్ లోఅంది ఉష, పండుతో.
'ఔనా! అడిగాడు...పెద్దపెద్దకళ్ళు...వాటిలో ఏవో ప్రశ్నలతో!
ఔనన్నట్లు తలాడించాడు ఆయన.
'మరీ...మరీ అవి నాకు చూపిస్తావా?' తల అదేపనిగా గుండ్రంగా ఊపుతూ...బతిమాలుతున్నట్లుగా అడిగాడు వాడు.
'చూపిస్తా...ఇప్పుడే వెళ్దాం' అన్నాడాయన.
*****
పంట పొలాలు...వాటిపై నుంచి వచ్చే చల్లటి గాలులు పండుకు హాయిగా తోచాయి.తాతయ్య చేతుల్నుంచి కిందకు జారాడు.పొలంగట్టంట నడవటం మొదలుపెట్టాడు.వాడెక్కడ పడ్తాడోనని, ప్రకాశం ఆదుర్దాగా వాడి వెంటే కనిపెట్టుకొని వున్నాడు.
పండు...తన బుల్లి బుల్లి పాదాల్ని పిల్ల కాలువ నీళ్ళల్లో ఆడించాడు.అక్కడ ట్రాక్టర్ ఎలా తిరుగుతుందో శ్రద్ధగా చూశాడు.
కంప్యూటర్లో ఆడే ఆటల్లో పొలాన్ని తాకటానికి లేదు.ఇక్కడ అచ్చంగా వాటిల్లో తను నడుస్తున్నాడు. పొలంలోని మొక్కల్ని,పైరుని చేత్తో తాకుతున్నాడు. అంతంత పేద్ద పేద్ద పొలాల్ని చూసి వాడి ఆశ్చర్యానికి అంతే లేదు. పక్క పొలాలలో వాళ్ళంతా  వీడ్ని పలకరించటం మొదలుపెట్టారు. వాడి పొలంలో కూడా మనుషులున్నారు. కానీ వాళ్ళతో మాట్లాడటం కుదరదు సరికదా, వాళ్ళతో వాళ్ళు కూడా మాట్లాడుకోరు. ఇక్కడ వీడ్ని...వీళ్ళంతా పలకరించటమే కాదు...ముద్దు చేస్తున్నారు.ఎత్తుకుంటున్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కలిసి భోంచేస్తున్నారు. చాలా సందడి వాతావరణంగా వుందక్కడ.
ఈ పొలం ఆట వాడికి బాగా నచ్చింది. ఇప్పటిదాకా వాడాడిన ఆట వాడికే నచ్చలేదు. పండిస్తే ఇక్కడ పండించాలిగాని...కంప్యూటర్లో కాదు అనిపించింది వాడికి.
వెంటనే తాతయ్య దగ్గరికి పరిగెట్టుకెళ్ళాడు.
'తాతయ్యా!మరే...మరే...'అన్నాడు.
'చెప్పు నాన్నా!ఇంటికెళ్దామా?'
కాదన్నట్లు తలూపాడు పండు.
'మరింకేంటి కన్నా?'
'మరీ...మరీ...ఈ పొలాలు నాకిచ్చేస్తావా?' అమాయకంగా ముఖం పెట్టుకుని...బతిమలాడుతున్నట్లు అడుగుతున్నాడు పండు.
గుండె ఆర్ద్రమైపోయింది ఆయనకు.
చప్పున మనవణ్ని హృదయానికి హత్తుకున్నారు.
వాడి ముద్దుమోముని తన రెండు చేతుల్లోకి తీసుకొని...
'ఇవన్నీ నీవే నాన్నా'అన్నాడాయన మార్దవంగా.
'నావా!' చిన్నవాడి కళ్ళు మెరిశాయి.
"ఈ ఊరొక్కటే కాదు..  ఈ నేల , ఈ నీరు, ఈ గాలి అన్నీ నీవే! నీకెవరూ వీటిని ఇవ్వక్కర్లేదు!"
తన చిట్టి చేతుల్ని తాతయ్య మెడచుట్టూ వేస్తూ ఆయన్ను అల్లుకుపోయాడు వాడు.
దేశానికి వెన్నెముక అవుతానంటున్న ఆ చిన్నవాడి వెన్ను నిమురుతూ...వాడి పరిష్వంగంలో తన్మయుడౌతూ...
'నీవెప్పుడూ "పచ్చపచ్చగా" వుంటావురా' అని మనసులోనే ఆశీస్సులందించాడు ఆ పెద్ద రైతు.