కథా వాహిని - సువ్వి

Thursday, March 28, 2013

రుచి


రుచి
జీవితపు రుచులు తెలియని చిన్నతనం రోజుల్లో ఎటువంటి ఆర్భాటాలూ లేకుండ రోజులు చాల హాయిగా, ఆహ్లాదంగా గడిచిపోయాయి అనిపిస్తుంది. ఆర్భటాలు లేవంటె.. ఆరాటాలు లేవని కాదు. జీవితపు రుచుల కోసం ఆర్భాటాలు లేవు. ఆర్భాటాల కోసం ఆరాటాలు లేవు. కానీ చిన్న చిన్న ఆశల కోసం ఆరాటాలు చాలానే వుండేవి. మరవి ఉంటేనే కద ఆనందం మన స్వంతమయ్యెది!? పిల్లలం మేము వేటికోసం ఆరాటపడి..ఆత్రపడేవాళ్లమో ఇప్పుడు తలుచుకుంటే చాల నవ్వు వస్తుంటుంది. పెద్దవాళ్ళు మినప్పప్పు రుబ్బుతుంటే పచ్చిపిండి తినాలని చేయి చాచేవాళ్లం. వద్దు మందమతులు అవుతారు, చెవుడొస్తుంది.. అన్నా వినిపించుకోకుండా చాచిన చేయి అలాగే వుంచేవాళ్ళం. వాళ్లిక గోరంతపిండి పెట్టగానే దాంట్లో చిటికంత ఉప్పు కలుపుకొని అలాగే తినేసేవాళ్లం. "గారెలు చేశాక తింటారు కదా" అనేవాళ్లు. అయినా ఈ పిండంత రుచి గారెలకెలా వస్తుందీ!? నేనైతే ఈ పెద్దలకు అస్సలు రుచే తెలియదనుకునే దాన్ని. కంది పచ్చడి రుబ్బుతున్నా అంతే. "అన్నం లో కలుపుకు తింటారు కదా..వఠ్ఠి పచ్చడే తినేస్తే ఎలా" అని కసిరేవాళ్లు. అయినా వినేవాళ్లం కాదు. "చెప్పిన మాట వినరు కదా..ఒఠి మొండి ఘటాలు" అంటూ పిసరంత పచ్చడి మా అరచేతుల్లో వేసేవాళ్లు. ఇంకాస్త పచ్చడి పెడితే ఏమౌతుందీ ..అని నిరాశగా అనుకుంటూనే కళ్ళల్లో మెరుపులతో కందిపచ్చడీ నాకేసేవాళ్లం.    ఇక పచ్చి కొబ్బరి తురుముతుంటే పెట్టమని అడిగితే "కూరలో వేస్తాం కదా" అని అరిచేస్తారు. వట్టి కొబ్బరి రుచి వేరు..కూరలో కలిస్తే అదివేరు. అసలేంటో పెద్దల (అభి)రుచే వేరు!
పకోడీలు చేసినా, చక్కిలాలు చేసినా కలిపిన శనగపిండీ రుచి..పకోడీలకి, చక్కిలాలకీ ఎక్కడిది! పెట్టమంటే మూదటిసారి పెడతారు. రెండోసారి నసుగుతూ పెట్టినా..మూడోసారి కొద్దిగా భయంతో మా అంతట మేమే తీసుకునేవాళ్లం. ఇక నాలుగోసారి చీవాట్లేసి.."ఇలాగైతే కడుపులో నెప్పి వస్తుంది. వట్టి పిండి తినేస్తే ఆనక చక్రాలు తినటానికి ఎన్ని వస్తాయ్? అంటూ కొద్దిగా చేతిలో పెట్టేసి తరిమేస్తారు. కొంచెం కొంచెం పెట్టే బదులు మరికాస్త పెడితే తాము మాటిమాటికీ రాముకదా! ఆ విషయం తోచదేం వీళ్లకు? అన్న ఆశ్చర్యం అప్పుడు!  ఒక కొత్త చీపురుపుల్లకి చింతపండు, ఉప్పు, జీలకర్ర కలిపి ఐస్ ఫ్రూట్ లా చీకేసేవాళ్లం. ఇలా మాలా ఆనందించటం పెద్దవాళ్లకి చేతనౌతుందా? అన్నం లో కలుపుకున్న ఆవకాయ ముక్క..పెరుగన్నంలో కన్నా వట్టిది, కడుక్కుని చప్పరిస్తుంటే ఆ మజానే వేరు! బొంబాయి రవ్వ, పంచదార కలిపేసుకొని నోటినిండా పొక్కేసుకుని తినటం, పేరినెయ్యి, పంచదార విస్తరాకులో కలిపేసుకొని నాకేయటం బెల్లం, ఎండుకొబ్బరి కలిపి తినేయటం, కలకండ చప్పరించటం, జీడీపప్పు, ఎండుద్రాక్ష దొంగతనంగా మింగేయటం..ఇంట్లో ఎన్ని పిండివంటలు చేసిపెడ్తున్నా.. ఈ చిన్న చిన్న రుచులకు సాటిరావు కదా!?
ఇంకా కొట్టు వెంకటేశ్వర్లు దగ్గర నూగుజీడీలు, బొరుగుముద్దలు తాతయ్యకు చెప్పి మానికలో సగానికి వడ్లు పోసుకుని తీసుకొని వెళ్లి కొనుక్కొనేవాళ్లం. ఇలా తింటూ కూడా ఇంకా.."బామ్మా ఏమన్నా పెట్టవా" అని ఆమె వెంటబడి వేధించేవాళ్లం.  వారం రోజులక్రితం చేసి, అందరికీ పంచిపెట్టేసి, అయిపోయిందని చెప్పిన "కొబ్బరిలౌజ్" చేతిలో పడ్డాకకానీ తెలిసేదికాదు..బామ్మ మాకోసం దాచి వుంచి మరీ పెడ్తోందని. అందుకే అప్పట్నుంచి అయిపోయిందని చెప్పే మాబామ్మని నమ్మేవాళ్లం కాదు. ఎక్కడ దాచి వుంచిందో అని వంటింట్లో తెగ వెతికేవాళ్లం. ఈ బామ్మ ఒకసారి దాచిన చోట మరోసారి దాచదు కదా! చోటు మార్చేస్తుంది. ఎప్పుడైనా వెతుకుతూ ఆమె కంటపడ్డామా .."ఏమర్రా శొంఠి శోధిస్తున్నట్లు శోధిస్తున్నారు?" అని ఉత్తుత్తి కోపం చూపెట్టేది.
మైసూర్ పాకం , బాదుషాలు, పాలకోవా తో గులాబ్ జామూన్లు,(జామూన్ ఆకారంలొ అంటే నేరేడు పండు ఆకారం), లడ్డూలు, సున్నుండలు, కజ్జికాయలు, రవ్వలడ్డూలు..ఒకటేమిటి.. అన్నిరకాలూ అడపాదడపా మాకోసం  చేస్తూనే వుండేది. మాకు పెట్టినంత పెట్టి దాస్తూనే వుండేది. మేమడిగినప్పుడు చేతుల్లో పడేస్తూనే వుండేది. వేసం కాలం వచ్చిందంటే మా మామిడి తొటనుంచి తాతయ్య తెప్పించిన అరమగ్గిన మామిడిపండ్లు, గడ్డిలో మాగేసిన సపొటాలు అప్పటికప్పుడు కొట్టించి తెప్పించిన తాటిముంజెలు ..!!
అయినా .. మా తిండికోసం ఆరాటపడటం మేమెప్పుడూ మానలేదు. కోపమొస్తే అన్నం మీద అలిగేవాళ్లం కానీ .. చిరుతిండ్ల మీద అలిగిన దాఖలాలు ఎప్పుడూ లేవు. మేము "అన్నం తినమూ" అంటూ అలిగితే.. పెద్దవాళ్ళు తినేసి అలగమని చెప్పేవాళ్లు. ఇక అన్నం తినేశాక మనల్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండీ!?  
*****

Monday, March 25, 2013

రైతుబిడ్డ



కథా భారతి
     
    రైతుబిడ్డ
 - రచన: చింతలచెరువు సువర్చల
అప్పటి దాకా పరిగెడుతున్న కారు తన వేగాన్ని తగ్గించింది. ఆ కార్లో కూర్చుని చుట్టూ పరిసరాలు చూస్తున్నాడు ఆరేళ్ళ "పండు". వాడికవన్నీ అబ్బురంగా తోస్తున్నాయి! పచ్చగా వున్న వరిపొలాల్ని చూసి "అబ్బ! ఎంత గ్రీనిష్!" అని తన చిట్టిచేతుల్ని నోటిపై పెట్టుకుంటూ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎత్తైన తాటిచెట్లను చూసి "ఎంత లాంగ్ గా వున్నాయో!" అని కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నాడు. పంట కాలువల్లో కనిపించే కొబ్బరి చెట్ల ప్రతిబింబాల్ని చూసి 'భలేగా వున్నాయం'టూ చప్పట్లు కొడ్తున్నాడు. అడపా దడపా కనిపించే ఎద్దులబండ్లను చూసి.. తను చూసిన పుస్తకాల్లో బొమ్మలుగా గుర్తిస్తున్నాడు. కొడుకు ఉల్లాసాన్ని చూస్తున్న రవి, ఉష ఒకరివంక ఒకరు చుసుకొని నవ్వుకుంటున్నారు. మధ్యమధ్యలో వాడ్ని ముద్దు చేస్తున్నారు. వాడి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్తూ, వాడి సందేహాలను తీరుస్తున్నారు.
అక్కడ చూస్తున్నవన్నీ వాడికాశ్చర్యాలే! తాటిచెట్లెక్కిన వాళ్లని చూసి.. వాళ్లక్కడికి ఎలా వెళ్లారో ఆ చిన్ని బుర్రకి తట్టలేదు.
"నాన్నా! వాళ్లక్కడెలా వున్నారు?" అని అడిగాదు.
వాళ్లు చెట్లెక్కార్రా నాన్నా. అదిగో అలా చూడు.. అతనెలా ఎక్కుతున్నాడో!" అంటూ మరోవైపు, అప్పుడే చెట్టెక్కబోతున్న వాడ్ని చూపించాడు రవి.
చెట్టుని చేతుల్తో ఆసరాగా తీసుకొని..పాదాల్ని చెట్టుకు అదిమిపెడ్తూ .. చకచకా పైకెక్కుతున్న వైనాన్ని చూసి..
"వాళ్లు స్కూల్లో నేర్చుకుంటారా నాన్నా?
అంటూ అడిగాడు.
"లేదు కన్న! ఇలాంటివి స్కూల్లో నేర్పరు. నిజానికి కొన్నింటిని స్కూల్లో నేర్చుకోలేం తెల్సా!? వాళ్లంతా పెద్దవాళ్లనో, తోటివారినో చూసి, ముందు ట్రై చేస్తారు. నెమ్మదిగా నేర్చుకుంటారు. అలా చూడు.. ఆ కాలువలో ఈత కొడుతున్నారా పిల్లలు? వాళ్లు కూడా అంతే.." అన్నాడు రవి.
"బాబుకి చాలా ఇంట్రెస్ట్ వుంది సర్" మెచ్చుకున్నాడు కారు డ్రైవర్ రాజు.
అవునంటూ తలూపాడు రవి.
ఇంతలో కారు ఊర్లోకి వచ్చేసింది.
ఎన్ని రకాల ఇళ్లో! పూరిళ్లు, పెంకుటిళ్లు, డాబా ఇళ్లు... తేడాని గుర్తించాడు పండు. అన్ని ముంగిళ్ల ముందూ వేసిన ముగ్గుల్ని గమనించాడు. ఇళ్ల పెరళ్లలో పూల మొక్కలో, పండ్ల చెట్లో వుండటం కూడా చూశాడు. కారు తిన్నగా ఓ పెద్ద గేటున్న డాబా ఇంటి ముందాగింది. కారు ఆగటమే తడవుగా పండు వాళ్ల బామ్మ, తాతయ్యలు శారద, ప్రకాశంలు.. అప్పటిదాకా ఎదురు చూస్తున్నారులా వుంది.. గబగబా గేటు బయటకు వచ్చేశారు. పండుగాణ్ణి అక్కున చేర్చుకున్నారు.
"రామ్మా!" అంటూ కోడల్ని, "ప్రయాణం బాగా జరిగిందా?" అంటూ కొడుకునీ పలకరించారు. సామాన్లన్నింటినీ పాలేరు వెంకన్న, డ్రైవర్ రాజు సాయంతో లోపల పెట్టేశాడు. డ్రైవర్ని భోంచేసి వెళ్లమని రవి చెప్పాడు.
"వద్దండీ" మొహమాటపడ్డాడతను.
"అదేంటీ.. భోజనం చేయకుండా ఎలా పంపిస్తాననుకుంటున్నావ్?"
"పక్క టౌన్లో భోంచేసే వెళ్తానండీ" అన్నాడతను.
"హోటల్లో ఎందుకయ్యా.. ఇల్లుండగా" ప్రకాశం అన్నాడు.
"పాతరోజుల్లో ఐతే వేరు.. ఇప్పుడా సౌకర్యం వుంది కదండీ!" అన్నాడు రాజు.
"పాత, కొత్త రోజులు కాదయ్యా, మంచి సాంప్రదాయాల్ని ఎప్పటికీ పాటించాల్సిందే. ఆ మాటకొస్తే .. కొత్తగా వచ్చే మంచివాటిని కూడా సంప్రదాయంగా స్వీకరించాల్సిందే!" అన్నాడాయన.
ఇంతలో "అన్నం తినే వెళ్లండంకుల్" అని పండు, రాజు చేయి పట్టుకొని అడిగాడు. ఆ చిన్నవాడు చూపించిన అభిమానానికి, పెద్దాయన చూపించే ఆదరానికి ఇక అతను కాదనలేకపోయాడు.
"మొహమాటపడకు. భోజనం తయారయ్యేదాకా కాస్త విశ్రాంతి తీసుకో" అంటూ రవి లోపలికి నడిచాడు.
"పదనాన్నా.. లోపలికెళ్దాం" మనవడి చేయి పట్టుకొని ప్రకాశం ముందుకు కదిలాడు.
తాతయ్య చేయి పట్టుకొని, కాంపౌండు లోపలికి అడుగుపెట్టిన పండు విభ్రమంగా చూస్తుండిపోయాడు.
'మామిడి చెట్టు.. బాదం చెట్టు.. పనసచెట్టు.. సపోటాచెట్టు.. కొబ్బరిచెట్టు.. నిమ్మచెట్టు..' అంటూ అన్నింటిపేర్లూ చెప్పేస్తూ.. ఆ చెట్ల మధ్యనే తిరుగుతున్నాడు.
"ఒర్నీ.. వీటిపేర్లన్నీ నీకెలా తెలుసురా?" అని తాతయ్య అడుగుతుంటే..
"ఓ..నాకు బాగా తెల్సు.. తెల్సా?" అని తిరిగి ఆయన్నే ప్రశ్నిస్తున్నాడు వాడు.
"వాడికి మేమే చెప్పాం నాన్నా! వాటి ఫొటోగ్రాఫ్స్ నెట్ లో దొరుకుతాయి కదా?" అన్నాడు అప్పుడే అటుగా వచ్చిన రవి.
"వీడికి చెట్లంటే చాలా ఇష్టంలాగుందే!?" అడిగాడాయన.
"అవున్నాన్నా.. అన్ని రకాల చెట్లనీ.. ఇంట్లో ఒక్కచోటే.. రియల్ గా చూసేసరికి చాలా హ్యాపీగా వున్నాడు." అన్నాడతను.
"అక్కడ వుండవట్రా?"
"ఉంటాయి. మనలా మాత్రం కాదు. ఇంట్లో క్రోటన్సుంటాయి. కొంతమంది కూరగాయలు కూడా పండిస్తుంటారు. కానీ ఇక్కడి నేటివిటి వేరు కదా!"
ఇంతలో లోపల్నుంచి పిలుపులు వచ్చాయి.
"లోపలికి పోదాం పద కన్నా!" మనవడ్ని అడిగాడు తాతయ్య.
"నేన్రాను.. ఇక్కడే ఆడుకుంటా" అన్నాడు వాడు.
లోపలికి నడిచాడు రవి.
కొడుకుని అనుసరించలేక, మనవడ్ని వదల్లేక అక్కడే రెండు కుర్చీలు వేయించుకొని, ఓ దాంట్లో కూర్చుని.. మనవడి చేష్టల్ని మురిపెంగా చూస్తుండిపోయాడు.
**********************************
మధ్యాహ్నం భోజనాలయ్యాక డ్రైవరికి డబ్బిచ్చి పంపించాడు రవి. వాళ్ళ ఆదరణకు అతను కదిలిపోయాడు. కృతఙ్ఞతలు చెప్పి వెళుతూ వెళుతూ...'సార్! మీరు తిరిగి వెళ్ళేటప్పుడు నాకొక్క ఫోన్ చేయండి. నేను మళ్ళీ ఇక్కడికే వచ్చి, మీరు తిరిగి అమెరికా వెళ్ళేదాక...ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీస్కెళ్తాను.మిమ్మల్ని ఎయిర్ పోర్ట్ దాకా దిగబెడ్తాను సార్...' అంటూ ఫోన్ నంబరిచ్చాడు.
'ఓ...ష్యూర్! అంటూ అతనికి ష్యేక్ హ్యాండిచ్చి, థ్యాంక్స్ చెప్పాడు రవి. డ్రైవర్ వెళ్ళిపోయాక... వెంకన్నతో మాట్లాడుతూ కొద్దిసేపు...పంచలోనే నుంచుండిపోయాడు. లోపల్నుంచి వాళ్ళమ్మ పిలిచేసరికి...'కాసేపు పడుకో బాబూ' అంటూ వెంకన్న వెళ్ళిపోయాడు.
**********************************
ఓ రోజు ఉదయం లాప్ టాప్ ముందు కూర్చుని...పండు ఏదో ఆసక్తిగా ఆడటం చూసి...అటుగా వెళ్తున్న ప్రకాశం, తానూ ఆసక్తిగా చూడటానికి వచ్చాడు. వాడు కంప్యూటర్లో ఆడుతున్న ఆట ఆయనకు ఆశ్చర్యమనిపించింది.
'ఏంటిరా ఇది?'అని అడుగుతూ...తనకున్న ఇంగ్లీషు పరిఙ్ఞానం కొద్ది ' ఇ కృషి ' అని స్క్రీన్ పైనున్నదాన్ని పైకి చదివాడు.
'ఔను తాతయ్యా! ఇవి క్రాప్స్. నేనే క్రాప్స్ కావాలన్నా వేస్తాను తెల్సా?'
'అవునా...ఏదీ ఒక్క పంట వేసి చుపించు...' అని అడిగేసరికి... 'ఇదిగో చూడు...'అంటూ అక్కడున్న టూల్స్ యూజ్ చేసుకుంటూ పొలాల్ని, మనుషుల్ని క్రియేట్ చేస్తూ... పంట పండించే ప్రాసెస్ అంతా తానే వాళ్ళ చేత చేయిస్తూ...పది నిమిషాల్లో కొమ్మలకు వేలాడే యాపిల్స్ తో సహా చూపించేశాడు పండు.
అదంతా చూసి "నా మనవడివనిపించుకున్నావురా" అంటూ "ఇదిగో శారదా! ఇలారా.. మన పండు వేసిన పంట చూడు.." ఆనందంగా కేకేశాడు. కోడలితోపాటే వచ్చి చూసిన శారద అవాక్కయింది. "ఎలా చేశావురా!" అంటూ.
"బామ్మక్కూడా చూపించరా నాన్నా" అని ముద్దుగా అడిగాడాయన.
ఈసారి పుచ్చకాయల్ని పండించాడు పండు. శారద తన మనవడ్ని అపురూపంగా అక్కున చేర్చుకుంది.
'ఇవెవరు కనిపెట్టార్రా' విస్తుపోయాడాయన.
'యు.ఎస్.లోనే మైక్రోసాఫ్ట్ వాళ్ళు నాన్నా. ఈ ఆటల్లో పొలం దున్నటం, పంట పండించటమే కాదు. ఆవుల్ని పెంచటం, పాలనీ, పంటల్నీ ట్రేడింగ్ చేయడం కూడా వుంటుంది. వాళ్ళ బ్యాంక్ బ్యలెన్స్ కి అనుగుణంగా, అవి చేసేవాళ్ళని, ప్రొడక్షన్ కి అవసరమయ్యే వాటిని క్రియేట్ చేసుకొవచ్చు. అదంతా ఓ వర్చ్యువల్ వరల్డ్ అన్నమాటా అన్నాడు రవి. ఆశ్చర్యంగా వింటూండిపోయారిద్దరూ!
'మీ తాతగారు నిజ్జంగా పంటలు పండిస్తారు తెల్సా? ఇలా కంప్యూటర్లో కాదు...ఫీల్డ్స్ లోఅంది ఉష, పండుతో.
'ఔనా! అడిగాడు...పెద్దపెద్దకళ్ళు...వాటిలో ఏవో ప్రశ్నలతో!
ఔనన్నట్లు తలాడించాడు ఆయన.
'మరీ...మరీ అవి నాకు చూపిస్తావా?' తల అదేపనిగా గుండ్రంగా ఊపుతూ...బతిమాలుతున్నట్లుగా అడిగాడు వాడు.
'చూపిస్తా...ఇప్పుడే వెళ్దాం' అన్నాడాయన.
*****************************
పంట పొలాలు...వాటిపై నుంచి వచ్చే చల్లటి గాలులు పండుకు హాయిగా తోచాయి.తాతయ్య చేతుల్నుంచి కిందకు జారాడు.పొలంగట్టంట నడవటం మొదలుపెట్టాడు.వాడెక్కడ పడ్తాడోనని, ప్రకాశం ఆదుర్దాగా వాడి వెంటే కనిపెట్టుకొని వున్నాడు.
పండు...తన బుల్లి బుల్లి పాదాల్ని పిల్ల కాలువ నీళ్ళల్లో ఆడించాడు.అక్కడ ట్రాక్టర్ ఎలా తిరుగుతుందో శ్రద్ధగా చూశాడు.
కంప్యూటర్లో ఆడే ఆటల్లో పొలాన్ని తాకటానికి లేదు.ఇక్కడ అచ్చంగా వాటిల్లో తను నడుస్తున్నాడు. పొలంలోని మొక్కల్ని,పైరుని చేత్తో తాకుతున్నాడు. అంతంత పేద్ద పేద్ద పొలాల్ని చూసి వాడి ఆశ్చర్యానికి అంతే లేదు. పొలంలో వాళ్ళంతా వీడ్ని పలకరించటం మొదలుపెట్టారు.వాడి పొలంలో కూడా మనుషులున్నారు. కానీ వాళ్ళతో మాట్లాడటం కుదరదు సరికదా, వాళ్ళతో వాళ్ళు కూడా మాట్లాడుకోరు.ఇక్కడ వీడ్ని...వీళ్ళంతా పలకరించటమే కాదు...ముద్దు చేస్తున్నారు.ఎత్తుకుంటున్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కలిసి భోంచేస్తున్నారు. చాలా సందడి వాతావరణంగా వుందక్కడ.
ఈ పొలం ఆట వాడికి బాగా నచ్చింది. ఇప్పటిదాకా వాడాడిన ఆట వాడికే నచ్చలేదు. పండిస్తే ఇక్కడ పండించాలిగాని...కంప్యూటర్లో కాదు అనిపించింది వాడికి.
వెంటనే తాతయ్య దగ్గరికి పరిగెట్టుకెళ్ళాడు.
'తాతయ్యా!మరే...మరే...'అన్నాడు.
'చెప్పు నాన్నా!ఇంటికెళ్దామా?'
కాదన్నట్లు తలూపాడు పండు.
'మరింకేంటి కన్నా?'
'మరీ...మరీ...ఈ పొలాలు నాకిచ్చేస్తావా?' అమాయకంగా ముఖం పెట్టుకుని...బతిమలాడుతున్నట్లు అడుగుతున్నాడు పండు.
గుండె ఆర్ద్రమైపోయింది ఆయనకు.
చప్పున మనవణ్ని హృదయానికి హత్తుకున్నారు.
వాడి ముద్దుమోముని తన రెండు చేతుల్లోకి తీసుకొని...
'ఇవన్నీ నీవే నాన్నా'అన్నాడాయన మార్దవంగా.
'నావా!' చిన్నవాడి కళ్ళు మెరిశాయి.
తన చిట్టి చేతుల్ని తాతయ్య మెడచుట్టూ వేస్తూ ఆయన్ను అల్లుకుపోయాడు వాడు.
దేశానికి వెన్నెముక అవుతానంటున్న ఆ చిన్నవాడి వెన్ను నిమురుతూ...వాడి పరిష్వంగంలో తన్మయుడౌతూ...
'నీవెప్పుడూ "పచ్చపచ్చగా" వుంటావురా' అని మనసులోనే ఆశీస్సులందించాడు ఆ పెద్ద రైతు.