Wednesday, April 17, 2013
Tuesday, April 9, 2013
పాలవెల్లి..
రారండోయ్..రారండోయ్..పిల్లలారా రారండోయ్..ఈ రేడియో సిగ్నేచర్ ట్యూన్ వినని వారెవ్వరు!?
బాలలకు ఆహ్వానం పలికే చిన్నపిల్లల కార్యక్రమం..ఎంత సందడిగా వుండేది! పిల్లలందరూ రేడియోలో చేరి, ఒకటే మాటలు, పాటలు, నాటికలు! కథలు, గేయాలు, దేశభక్తి గేయాలు!
చిట్టడవి అంతా కలియ తిరుగుతున్న పక్షుల్లా..ఒకటే అల్లరి! ఒకటే కబుర్లు!
ఎంత ఉత్సాహం! మరెంత ఆనందం!
గొంతుల్లో, గుండెల్లో స్వేచ్ఛ ప్రతిధ్వనించేది! ఓ అరగంటసేపు మనల్నీ వాళ్లతోపాటే లాక్కునివెళ్లి.. ఉన్నట్లుండి..
"ఇకచాలు ఇళ్లకు వెళ్లిపోదామా! మంచి మాటలు, మంచి పాటలు మంచి ఆటలు నేర్చుకున్నాం! పాలవెల్లి..! అంటూ మనింట్లో వదిలేసేవారు!
చిన్నప్పుడు..రేడియోలో ఇంతమంది పిల్లలు ఎలా పడ్తారబ్బా! అనుకునేదాన్ని!
(నిజానికి మాఇంట్లో పేద్ద రేడియోనే! అయినా పిల్లలు పట్టేంత కాదుగా!)
బాలానందం అంటూ, బాల భారతి అంటూ, బాలవినోదం అంటూ రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు, ఆయన భార్య కామేశ్వరి గార్లు మొదలుపెట్టిన చిన్నపిల్లల కార్యక్రమాలు ఇప్పుడు అంతగా రావటం లేదని బెంగ! పిల్లల్లోని చైతన్యానికి మెరుగులు దిద్దిన ఈ కార్యక్రమాలు..ఇప్పుడు నామమాత్రంగా వస్తున్నాయి! పూని ఎవరైనా తలబెట్టితే ఎంత బాగుండు!!
Sunday, April 7, 2013
బుక్కులు-ఋక్కులు
బుక్కులు
మీరు సరీగ్గానే విన్నారు! ఎన్నాళ్లైందో కదా ఈ పదాన్ని ఉపయోగించి!?
మన కథల పుస్తక ప్రస్థానం గురించి మాట్లాడాలనిపించిందీ రోజు.
అమ్మ మనకు పరిచయం చేసిన మూడు చందమామలే మన ఈ పయనానికి ఒక అర్ధాన్ని సమకూర్చాయి.
ఆ మూడు చందమామలు:
1. అమ్మ చంకనెత్తుకొని గోరుముద్దలు తినిపిస్తూ.."చందమామ రావే.." అంటూ పాడి..మనకు నేర్పించి..మన మనసుల్లో ఉత్సాహానికి
బీజం వేసింది!
2. ఆ తర్వాత, కొద్దిగా ఊహ తెలిశాక చెప్పిన --చందమామలో రాట్నం వడుకుతున్న అవ్వ, పరుగెడుతున్న కుందేలు --కథ, కథల
మీద ఆసక్తికి సరికొత్త నాంది అయింది.
3. కాస్త చదవగలిగే నాటికి "చందమామ" పుస్తకాన్ని అందించింది.
అది కొన్నాళ్లకే అపురూపమై..దినచర్యలో ఒక భాగమైంది. నెలంతా ..మళ్లీ వచ్చే పుస్తకం కోసం నిరీక్షణ! మరోలా .. చందమామ
రావే..అంటూ ఆలపించేలా!!
ఒక్క చందమామేనా.. బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు, జాబిల్లి,(బాల..న్యాయపతి రాఘవరావు గారి పత్రిక ..నేను పుట్టేనాటికే ఆ పత్రిక
ఆగిపోయిందనుకుంట!)
మరి ఈ పత్రికలు.. మనకు ఊహాశక్తినే పెంచాయో .. మన బుర్రల్లో ఊహాచిత్రాల్నే గీశాయో !!(కళాశ్రీ లాంటి వాళ్ల బొమ్మలున్నప్పటికీ)
అందాల రాకుమారి, వీరుడైన రాకుమారుడు, పంచకళ్యాణి గుర్రం, మాట్లాడే చిలుక, మాంత్రికుడు, ఒంటిస్తంభం మేడ, సప్త సముద్రాలు,
మర్రిచెట్టు, ఒంటికన్ను రాక్షషి, రాక్షసబల్లి...ఇవన్నీ ఓ కొత్తలోకం లోకి మనల్ని తీసుకెళ్లి వదిలిపెట్టేవి!
గుణవంతులు, ధైర్యవంతులు, పరోపకారం చేసేవాళ్ళు, లౌక్యం, సమయస్పూర్తి తెల్సిన వాళ్లు, దాన గుణం కలిగిన వాళ్లు, మెతక వాళ్లు,
మృదుస్వభావులు, వెర్రివాళ్లు, అత్యాశాపరులు, దురాశాపరులు, పిరికి వాళ్లు, గయ్యాళివాళ్లు, దుర్మార్గులు..
ఒకరేమిటి..అందరూ మనముందుకొచ్చి నిలబడి జీవించేవాళ్లు! ఎలా వుండాలో, ఎలా వుండకూడదో నేర్పేవాళ్లు!
"అనగనగా..ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు.." అంటూ తాతయ్య వినిపించిన కథ , కథలు చదివేవైపుకు నడిపించిన మొదటి
అడుగని చెప్పాలి!
బోధిసత్వుడు బ్రహ్మదత్తుడిగా రావటం , కథంతా విని, సమాధానం దొరకగానే బేతాళుడు చెట్టెక్కేయడటం లేదా యువతి జంతువుగా
మారి అడవి లోకి పరిగెత్తటం, తెలిసీ సమాధానం చెప్పకపోయావో నీ తల వేయి వక్కలౌతుందని విక్రమార్కున్ని బేతాళుడు బెదిరించటం,
సిం హాసనాన్ని అధిరోహించే భోజుణ్ణి సాలభంజికలు అడ్డుపడటం..ఇవన్నీ ధైర్యంగా ముందుకు నడిపే చిట్కాలు నేర్పినట్లుండేవి!
ఇవన్నీ పునాది రాళ్ళు!
ఇక బాల్యము, కౌమారమూ దాటి యవ్వనంలోకి అడుగు పెట్టాక మనల్ని ఊహల పందిరిని అల్లుకునేలా, ఆశల పల్లకిని అందగించేలా
చేసినవి..నవలలు! మరి ఆ వయసుకు తగిన ముగ్ధత్వం వుంటేనే ఆరొగ్యంగా వున్నట్లు!
ఇంట్లో పెద్దవాళ్లు వారపత్రికలకోసం తన్నుకుంటుండే కాలం!
అవును మరి ధారావాహికలు వస్తుండేవి కద? చక్రభ్రమణం, మీనా, మీరా ఒకటేమిటి.. ఇలాంటి చిక్కటి ఫిక్షన్ .. ఫిల్టర్ కాఫీ డికాక్షన్ లా
ఆకర్షిస్తుండేవి! యువ, విజయ లాంటి మాస పత్రికలు, ఆంధ్ర పత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ లాంటి వారపత్రికలు ఈ కాఫీ లాంటి సీరియల్స్
ని అందించేవి! ఇవి ఇంకావుంది అంటూ వూరించేవి!(కృష్ణబావ ఇంకావుంది.. అనుంటే పత్రికంతా వెతికేవాడట..ఎక్కడుందో అనుకుంటూ!
తన ఫ్రెండ్ నర్శిం హ చెప్పేదాక అసలు విషయం తెలీలేదట!) పత్రికల్లొ వచ్చిన సీరియల్స్ ని పెద్దవాళ్లు కత్తిరించి బైండింగ్ చేయించారు.
అవే.. పదహారేళ్ల వయసులో ఆ పాత బైండింగులే చదివింది ! చక్రనేమి, పూజారిణి,కీర్తి కిరీటాలు లాంటి నవలలు (ఆరెకపూడి,
యద్దనపూడి,పోల్కంపల్లి శాంతాదేవి లాంటి నవలాకారులు) పురాణం వారి ఇల్లాలిముచ్చట్లు కూడా. వాటిని చదివి కొంత వ్యక్తిత్వానికి
వన్నెలద్దుకున్న మాట నిజం!
అప్పుడే వచ్చాయి..సెన్సేషనల్ నావెల్స్..యండమూరి, మల్లాది వారివి!
కొత్తదనాన్ని సరికొత్తగా పరిచయం చేసిన నవలలు!
భావుకతను మనసుకు అద్దిన కథనాలు!
జీవితాన్ని కొత్త బాణీలలో సమకూర్చిన కూనిరాగాలు!!
(అవును మరి కూనిరాగం ఎవరైనా పాడుకోగలిగినది!)
అవి చాలా ప్రభావితం చేసాయి! వీటితో బాటు చలం సాహిత్యం!
టీనేజ్ దశ దాటాక అసలైన సాహితీప్రపంచం లోకి అడుగుపెట్టాం కదా?
చాసో, తిలక్, కొడవటిగంటి, మల్లాదిరామకృష్ణ శాస్త్రి, శ్రీపాద,మధురాంతకం, ముళ్లపూడి వెంకటరమణ సాహిత్యం, శంకరమంచి
అమరావతి కథలు ..ఇలా ఎన్నెన్నో!
ఇవన్నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోటంలో సహాయం చేశాయి.
నేనంటాను మన దృక్కోణం విశ్లేషణే అవక్కర్లేదు. అంత స్థాయి అవసరం కూడా లేదు. చదివి మనల్ని అహ్లాదంగా వుంచుకోగలిగితే చాలు.
జీవనవిధానం ఖచ్చితంగా బాగుంటుంది. మనము సంతోషంగా వుండగలం! మన చుట్టూ వారినీ సంతొషంగా వుంచగలం! ఇదే నా
పాలసీ!
మీరేమంటారు? ఒప్పుకుంటారుగా బుక్కులు..మన పాలిటి ఋక్కులని!!
Thursday, April 4, 2013
సౌరు
సౌరు
దీపారాధన చేస్తుంటే.. ఆ వాసన ఒక్కసారిగా నన్ను వెనక్కు నెట్ట్టేసింది. మా బాలపిన్నితో కలసి రోజూ ఉదయాలు రాములవారి గుడికి వెళ్ళేదాన్ని. గర్భగుడి బాగుచేసి, ముగ్గేసిరావటం, సాయంకాలాలు సంధ్య దీపారాధన చేయటం! మా ఉర్లో అలా సంవత్సరానికి రెండు నెలలు మా ఇంటి వంతు వచ్చేది. సాయంకాలాలు దీపారధన వాసన..ఇప్పటికీ ముక్కుపుటాలకి తాజాగా తగులుతుంది. నేను బుట్టచేతుల గౌను వేసుకొని, మా పిన్ని వెనుక ముగ్గుబుట్టో, అగ్గిపెట్టొ తీసుకొని వెళ్తున్న చిత్రం కూడా తాజాగా కనబడ్తుంది.
దేవిడిమీద భక్తి తెలియని వయసది. సీతారామలక్ష్మణుల విగ్రహాలు మౌనంగా మేంచేస్తున్న పనిని చూస్తున్నారన్నట్లు భావించేదాన్ని. విగ్రహాల మీద ఆపేక్ష! మావూరు..మా గుడి..మా దేవుడు..గుడిగంటలు ..అన్నీ 'మా ఉనికిని ' తెలియచేయటానికే అన్న భావాన్ని అప్పటికి వ్యక్తం చేయగల శక్తి లేకపోవచ్చు. అప్పటి నా చిన్న మనసుకు "అంతా మనదే" అన్న నిష్కళంక ప్రేమ! కంటిముందే బాల్యం మరెన్నో వాసనలు మూటగట్టుకొని..మెదడులో వాటిని ప్రత్యేక అణువుల్లో భద్రపరిచింది. ఏ వాసన వస్తే ఆ విభాగం తలుపులు తెరుచుకుంటాయ్. మల్లెపూల వాసన, వేపపూల వాసన ..మా వూరి మా పెరట్లోకి తీసుకెల్తుంది. దేవగన్నేరు మా హేమలత పిన్ని వాళ్ల గాయత్రి అమ్మవారి గుడిని(వాళ్ల మామిడితోటలో ..పూర్వీకులు కట్టించిన గుడి అది), పారిజాతాలు .. పిన్నీ వాళ్లింటిని,(అత్తగారిల్లు ..పేద్ద ఉమ్మడి కుటుంబం)గుర్తుకు తెప్పిస్తాయి. సిం హాచలం సంపెంగలు విశాఖ వీధుల్లోకి లాక్కెళ్తాయి. ఎంత ఉల్లాసంగా, ఆనందంగా గడిపిన రోజులవి! వీధి బడిలో (ఎలిమెంటరీ స్కూల్) గుక్కతిప్పుకోకుందా రెన్ రెండ్లారు..అంటూ ఇరవై ఎక్కాలూ వల్లెవేయటం ..పక్కనే ఉన్న మాఇంట్లోనుంచి చిలకడ దుంపలు వేగుతున్న వాసనకి..'మంచి నీళ్లు ' అంటూ మేష్టారి ముందు బొటనవ్రేలు చూపించి..తుర్రున ఇంటికి పరుగుతీసి, నీళ్లపొయ్యిలో నిప్పుల మధ్య కాలుతున్న దుంపని పుల్లతో బయటకు లాగి..నోరు కాలుతున్నా లెక్కచేయకుండా ఆదరాబాదరాగా మింగేసి..ఇన్ని మంచినీళ్లు తాగేసి..నీళ్లతో గొంతు, బట్టలు తడిసినా తుడుచుకోకుండానే మళ్లీ పరుగెత్తుకుంటూ స్కూల్లోకొచ్చి పడటం!
పాత పుస్తకం వాసన..కొత్త పుస్తకం వాసన..దేనికదే సాటి! ఎంత ఆస్వాదించినా తనివి తీరదు! తొలకరి చినుకులకు తడిసిన నేల వాసన, గమ్మత్తైన తడిసిన గచ్చు వాసన, గోడమీద నీళ్లు చల్లి మరీమరీ చూసిన సున్నం వాసన, బావి గిలకపై తడిసిన చేంతాడు వాసన, గోధూళి వాసన, గొబ్బెమ్మల వాసన, పచ్చ్టి తాటాకు పందిరి వాసన, చేటలకు పూసే కాగితం..మెంతులు కలిపి రుబ్బిన పిండి వాసన, కుంపట్లో మరుగుతున్న పాల వాసన,గాదెల్లో ధాన్యం వాసన, గాలికి తేలివచ్చే మంచి తుమ్మపూల వాసన, నిండుగ పారే పంట కాలువ వాసన, పండు మిరపకాయ చేలో బంతిపూల వాసన, కొత్తిమెర చేల వాసన, సంక్రాంతికి రేగుపండ్ల వాసన, మగ్గబెట్టిన మామిడి పండ్ల వాసన, తొలిఏకాదశికి పేలాలు, నువ్వు పిండి వాసన, దోసగింజలు వేగుతున్న వాసన ఒకటేమిటి ఇవి అనుక్షణం మన ఉనికినీ, విలువనీ తెలియచేస్తూనే వుంటాయి. అయితే..కాలం తోబాటు..పల్లె ప్రజల ఆలోచనల్లోనూ మార్పు..పల్లెను పల్లెఉనికి కి దూరం చేశాయి. ఆ విలువను పోగొట్టుకుంటున్నాయి. చివరికి నేల వాసన నేలకు లేకుండా పొయింది. ఇంట, బయటా.. అంతా..పురుగుమందుల వాసన తో నిండిపోయింది!!
Subscribe to:
Posts (Atom)