కథా వాహిని - సువ్వి

Thursday, March 28, 2013

రుచి


రుచి
జీవితపు రుచులు తెలియని చిన్నతనం రోజుల్లో ఎటువంటి ఆర్భాటాలూ లేకుండ రోజులు చాల హాయిగా, ఆహ్లాదంగా గడిచిపోయాయి అనిపిస్తుంది. ఆర్భటాలు లేవంటె.. ఆరాటాలు లేవని కాదు. జీవితపు రుచుల కోసం ఆర్భాటాలు లేవు. ఆర్భాటాల కోసం ఆరాటాలు లేవు. కానీ చిన్న చిన్న ఆశల కోసం ఆరాటాలు చాలానే వుండేవి. మరవి ఉంటేనే కద ఆనందం మన స్వంతమయ్యెది!? పిల్లలం మేము వేటికోసం ఆరాటపడి..ఆత్రపడేవాళ్లమో ఇప్పుడు తలుచుకుంటే చాల నవ్వు వస్తుంటుంది. పెద్దవాళ్ళు మినప్పప్పు రుబ్బుతుంటే పచ్చిపిండి తినాలని చేయి చాచేవాళ్లం. వద్దు మందమతులు అవుతారు, చెవుడొస్తుంది.. అన్నా వినిపించుకోకుండా చాచిన చేయి అలాగే వుంచేవాళ్ళం. వాళ్లిక గోరంతపిండి పెట్టగానే దాంట్లో చిటికంత ఉప్పు కలుపుకొని అలాగే తినేసేవాళ్లం. "గారెలు చేశాక తింటారు కదా" అనేవాళ్లు. అయినా ఈ పిండంత రుచి గారెలకెలా వస్తుందీ!? నేనైతే ఈ పెద్దలకు అస్సలు రుచే తెలియదనుకునే దాన్ని. కంది పచ్చడి రుబ్బుతున్నా అంతే. "అన్నం లో కలుపుకు తింటారు కదా..వఠ్ఠి పచ్చడే తినేస్తే ఎలా" అని కసిరేవాళ్లు. అయినా వినేవాళ్లం కాదు. "చెప్పిన మాట వినరు కదా..ఒఠి మొండి ఘటాలు" అంటూ పిసరంత పచ్చడి మా అరచేతుల్లో వేసేవాళ్లు. ఇంకాస్త పచ్చడి పెడితే ఏమౌతుందీ ..అని నిరాశగా అనుకుంటూనే కళ్ళల్లో మెరుపులతో కందిపచ్చడీ నాకేసేవాళ్లం.    ఇక పచ్చి కొబ్బరి తురుముతుంటే పెట్టమని అడిగితే "కూరలో వేస్తాం కదా" అని అరిచేస్తారు. వట్టి కొబ్బరి రుచి వేరు..కూరలో కలిస్తే అదివేరు. అసలేంటో పెద్దల (అభి)రుచే వేరు!
పకోడీలు చేసినా, చక్కిలాలు చేసినా కలిపిన శనగపిండీ రుచి..పకోడీలకి, చక్కిలాలకీ ఎక్కడిది! పెట్టమంటే మూదటిసారి పెడతారు. రెండోసారి నసుగుతూ పెట్టినా..మూడోసారి కొద్దిగా భయంతో మా అంతట మేమే తీసుకునేవాళ్లం. ఇక నాలుగోసారి చీవాట్లేసి.."ఇలాగైతే కడుపులో నెప్పి వస్తుంది. వట్టి పిండి తినేస్తే ఆనక చక్రాలు తినటానికి ఎన్ని వస్తాయ్? అంటూ కొద్దిగా చేతిలో పెట్టేసి తరిమేస్తారు. కొంచెం కొంచెం పెట్టే బదులు మరికాస్త పెడితే తాము మాటిమాటికీ రాముకదా! ఆ విషయం తోచదేం వీళ్లకు? అన్న ఆశ్చర్యం అప్పుడు!  ఒక కొత్త చీపురుపుల్లకి చింతపండు, ఉప్పు, జీలకర్ర కలిపి ఐస్ ఫ్రూట్ లా చీకేసేవాళ్లం. ఇలా మాలా ఆనందించటం పెద్దవాళ్లకి చేతనౌతుందా? అన్నం లో కలుపుకున్న ఆవకాయ ముక్క..పెరుగన్నంలో కన్నా వట్టిది, కడుక్కుని చప్పరిస్తుంటే ఆ మజానే వేరు! బొంబాయి రవ్వ, పంచదార కలిపేసుకొని నోటినిండా పొక్కేసుకుని తినటం, పేరినెయ్యి, పంచదార విస్తరాకులో కలిపేసుకొని నాకేయటం బెల్లం, ఎండుకొబ్బరి కలిపి తినేయటం, కలకండ చప్పరించటం, జీడీపప్పు, ఎండుద్రాక్ష దొంగతనంగా మింగేయటం..ఇంట్లో ఎన్ని పిండివంటలు చేసిపెడ్తున్నా.. ఈ చిన్న చిన్న రుచులకు సాటిరావు కదా!?
ఇంకా కొట్టు వెంకటేశ్వర్లు దగ్గర నూగుజీడీలు, బొరుగుముద్దలు తాతయ్యకు చెప్పి మానికలో సగానికి వడ్లు పోసుకుని తీసుకొని వెళ్లి కొనుక్కొనేవాళ్లం. ఇలా తింటూ కూడా ఇంకా.."బామ్మా ఏమన్నా పెట్టవా" అని ఆమె వెంటబడి వేధించేవాళ్లం.  వారం రోజులక్రితం చేసి, అందరికీ పంచిపెట్టేసి, అయిపోయిందని చెప్పిన "కొబ్బరిలౌజ్" చేతిలో పడ్డాకకానీ తెలిసేదికాదు..బామ్మ మాకోసం దాచి వుంచి మరీ పెడ్తోందని. అందుకే అప్పట్నుంచి అయిపోయిందని చెప్పే మాబామ్మని నమ్మేవాళ్లం కాదు. ఎక్కడ దాచి వుంచిందో అని వంటింట్లో తెగ వెతికేవాళ్లం. ఈ బామ్మ ఒకసారి దాచిన చోట మరోసారి దాచదు కదా! చోటు మార్చేస్తుంది. ఎప్పుడైనా వెతుకుతూ ఆమె కంటపడ్డామా .."ఏమర్రా శొంఠి శోధిస్తున్నట్లు శోధిస్తున్నారు?" అని ఉత్తుత్తి కోపం చూపెట్టేది.
మైసూర్ పాకం , బాదుషాలు, పాలకోవా తో గులాబ్ జామూన్లు,(జామూన్ ఆకారంలొ అంటే నేరేడు పండు ఆకారం), లడ్డూలు, సున్నుండలు, కజ్జికాయలు, రవ్వలడ్డూలు..ఒకటేమిటి.. అన్నిరకాలూ అడపాదడపా మాకోసం  చేస్తూనే వుండేది. మాకు పెట్టినంత పెట్టి దాస్తూనే వుండేది. మేమడిగినప్పుడు చేతుల్లో పడేస్తూనే వుండేది. వేసం కాలం వచ్చిందంటే మా మామిడి తొటనుంచి తాతయ్య తెప్పించిన అరమగ్గిన మామిడిపండ్లు, గడ్డిలో మాగేసిన సపొటాలు అప్పటికప్పుడు కొట్టించి తెప్పించిన తాటిముంజెలు ..!!
అయినా .. మా తిండికోసం ఆరాటపడటం మేమెప్పుడూ మానలేదు. కోపమొస్తే అన్నం మీద అలిగేవాళ్లం కానీ .. చిరుతిండ్ల మీద అలిగిన దాఖలాలు ఎప్పుడూ లేవు. మేము "అన్నం తినమూ" అంటూ అలిగితే.. పెద్దవాళ్ళు తినేసి అలగమని చెప్పేవాళ్లు. ఇక అన్నం తినేశాక మనల్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండీ!?  
*****

2 comments:

  1. భలేగా గుర్తుచేసారన్నీ. ఇప్పటి వాళ్ళకి వీటిలో చాలా రుచులు తెలీవు. మా అమ్మావాళ్ళు మేము సిటీ లో పెరగడం వల్ల, సెలవులకి మటుకే అమ్మమ్మ వాళ్ళ వూరికి వెళ్ళడం వల్ల చాలా రుచుల గురించి మాలి తెలీదు అంటూ వుంటుంది. ఇక మా వాడికి అలవాటు చేద్దామన్నా కొన్ని మటుకే. ఛీ ఛీ అనేస్తాడు.ఇప్పుడు అన్ని రకాలు రోజూ చేసుకోవడం వల్ల పండగలకి ప్రత్యేకంగా ఏవి చెయ్యాలా అన్న ఆలొచనే. ఇప్పటి పిల్లలకి విసుగు రావడానికి కారణం, అడక్కుండానే అన్నీ అమర్చడమేమో...అనూ

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ చూసి చాలా సంతోషమేసింది అనూగారు! మీరు చెప్పింది కూడా నిజమేను..

      Delete